మిల్లుల వద్ద అన్‌లోడింగ్ పెంచాలి

– అదనపు లారీలు, టార్పాలిన్లు ఏర్పాటు చేయాలి
– పౌరసరఫరాల శాఖ కమిషనర్ రవీంద్ర ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌తోపాటు వెహికల్ రొటేషన్, కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడం, లారీలు, హమాలీలను పెంచాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, హమాలీలు, ట్రక్ షీట్లు, మిల్లుల ట్యాగింగ్ చేసిన వాహనాలు, టార్పాలిన్లు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, కేంద్రం నిర్వాహకుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రానికి 25 వేల క్వింటాళ్ల ధాన్యం వచ్చిందని, ఇందులో 7000 క్వింటాళ్లు కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేశామని, ఇంకా కొనుగోలు కేంద్రంలో 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు వివరించారు. పెదకాపర్తి కేంద్రం పెద్ద సెంటర్ అయినందున అన్ని పెద్ద సెంటర్లలో 10 నుండి 20 వరకు అదనపు లారీలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కమిషనర్‌కు వివరించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని మిల్లర్లకు ముందే సమాచారం ఇచ్చామని, ఒక్కో కొనుగోలు కేంద్రంలో 30మంది హమాలీలు ఉన్నారని, మిల్లుల్లో సైతం 30 నుండి 35 మంది వరకు హమాలీలను ఉంచినట్లు తెలిపారు. కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ట్యాబ్ ఎంట్రీ నూటికి నూరు శాతం కావాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు డ్రయ్యర్లు, శుభ్రపరిచే విధానాలను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల వివరాలను, టార్పాలిన్ల గురించి అడిగారు. అవసరమైతే అదనపు టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కమిషనర్ వట్టిమర్తిలో ఉన్న సిద్ధార్థ రైస్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి అక్కడ ఎంతమంది హమాలీలు ఉన్నారని అడగగా 35 మంది ఉన్నారని తెలిపారు. ఆన్ లోడింగ్, వెహికల్ రొటేషన్ పెంచాలన్నారు. సిస్టం ద్వారా ధాన్యం వివరాల అప్‌లోడింగ్, ట్యాబ్ ఎంట్రీ వివరాలను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ట్యాబ్ ఎంట్రీ పెండింగ్ ఉన్న కొనుగోలు కేంద్రాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, మిల్లుల్లో స్థలం లేకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు తరలించాలని, ధాన్యం తరలింపుతోపాటు, మరిన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణిని సివిల్ సప్లైస్ కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జీఎం నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ వెంకటేశం, డీఎం. రాంపతి నాయక్, డీసీఓ పత్యానాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, చిట్యాల తహసిల్దార్ విజయ్, తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *