– 15 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలి
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: రాష్ట్రంలో మరింత పారదర్శక పరిపాలన అందించేందుకు ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్)లో పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ- హెచ్ఆర్ఎంఎస్ అమలు, ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ విధానాలపై అన్ని శాఖల ఉన్నతాధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, సర్వీస్ రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు, ఏసీఆర్లు, ఇతర ఉద్యోగ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తేవాలని సూచించారు. సుమారు 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటాను ఈ- హెచ్ఆర్ఎంఎస్ లో నమోదు చేస్తున్నట్లు అధికారులు సీఎస్‌కు వివరించారు. మొత్తం 38,710 కార్యాలయాలకు సంబంధించిన డేటాలో ఇప్పటికే సుమారు 93 శాతం పూర్తి చేసినట్లు తెలపగా మిగిలిన ప్రక్రియను 15 నాటికి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
భవిష్యత్తులో డిజిటల్ అనుమతులకే ప్రాధాన్యం
పరిపాలనలో పారదర్శకత, వేగం, సామర్థ్యాన్ని పెంచేందుకు భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, ఉత్తర్వులను సాధ్యమైనంత వరకు డిజిటల్ విధానంలోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆర్థిక శాఖకు సంబంధించిన ఈ-శాంక్షన్ ఉత్తర్వులను పూర్తిగా డిజిటల్ విధానంలోకి తేవాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక సేవలు, మంజూరులు, చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియలను ఆన్లైన్లో నిర్వహించేలా వ్యవస్థలను సమన్వయం చేయాలన్నారు.
పనులన్నీ ఆన్లైన్లోనే
ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన సాంకేతిక అనుమతుల ప్రక్రియను కూడా ఆన్లైన్లో నిర్వహించాలని సీఎస్ తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నుంచి చీఫ్ ఇంజనీర్ (సీఈ) వరకు సాంకేతిక అనుమతుల ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టాలని సూచించారు. అలాగే లబ్దిదారులకు నేరుగా అందించే డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) మంజూరులను ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
డిజిటల్ పరిపాలనకు నోడల్ అధికారులు
ఈ- హెచ్ఆర్ఎంఎస్ తోపాటు అన్ని డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి శాఖలో నోడల్ అధికారిని నియమించాలని సీఎస్ సూచించారు. అమలులో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేలా శాఖల వారీగా సమన్వయం ఉండాలని తెలిపారు. ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మరింత ఊతమిచ్చేలా డిజిటల్ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు బి.ఎం.డి.ఎక్కా, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, అహ్మద్ నదీం, క్రిస్టినా చోంగ్తు, శిఖా గోయల్, కార్యదర్శులు గౌరవ్ ఉప్పల్, లోకేష్ కుమార్, దివ్య దేవరాజన్, సురేంద్ర మోహన్, హరిచందన, ఇ.శ్రీధర్, సిక్తా పట్నాయక్, విజయేంద్ర, సమాచార, పౌరసంబంధాల స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




