– రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం
– లబ్దిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరకాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం 2025-26 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకం కోసం రూ.71 కోట్లు కేటాయించగా రూ.63 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతులకు మరింత విస్తృతంగా యాంత్రీకరణ ప్రయోజనాలు అందించేందుకు 2026-27కి రూ.147.99 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర, కేంద్ర వాటాలతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని, లబ్దిదారుల ఎంపికకు సంబంధించి కేంద్రం జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్లు, అవి అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పరికరాన్ని తమకు నచ్చిన ఎంప్యానెల్ చేసిన కంపెనీ వద్ద కొనుగోలు చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించాలని మంత్రి సూచించారు. సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేయనుండటం వల్ల రైతులు పరికరం కొనుగోలు చేసే ముందు వివిధ కంపెనీల ధరలను, నాణ్యతను పరిశీలించి, తక్కువ ధరకు నాణ్యత కలిగిన పరికరం ఎక్కడ లభిస్తే అక్కడే కొనుగోలు చేసుకుంటారని మంత్రి సూచించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం, బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ అందుతుందని మంత్రి తెలిపారు.
37 రకాల వ్యవసాయ పరికరాలు
ఈ పథకం కింద రైతులకు అందించేందుకు ప్రస్తుతం 37 రకాల వ్యవసాయ పరికరాలను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో 19 రకాల పరికరాలు మాత్రమే ఉండేవని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పరికరాల సంఖ్యను 37కు పెంచినట్లు చెప్పారు. ఇందులో పవర్ టిల్లర్, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టిల్లర్/వీడర్, డిస్క్ ప్లౌ, కల్టివేటర్, లెవలింగ్ బ్లేడ్, రోటావేటర్, రోటో-పుడ్లర్, రివర్సిబుల్ ఎంబీ ప్లౌ, సబ్ సాయిలర్, బండ్ ఫార్మర్, సీడ్-కం-ఫెర్టిలైజర్ డ్రిల్, మల్టీ క్రాప్ ప్లాంటర్, రైజ్డ్ బెడ్ ప్లాంటర్, పోస్ట్ హోల్ డిగ్గర్, ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషిన్, ఫెర్టిలైజర్ బ్రాడ్‌కాస్టర్, రిడ్జ్ ఫరో ప్లాంటర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్, పవర్ వీడర్, మాన్యువల్ నాప్‌సాక్ స్ప్రేయర్, పవర్ నాప్‌సాక్ స్ప్రేయర్, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, మైజ్ కంబైన్ హార్వెస్టర్, మల్టీ క్రాప్ థ్రెషర్, విన్నోయింగ్ ఫ్యాన్, మైజ్ షెల్లర్, టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్స్, పసుపు బాయిలర్, పసుపు పాలిషర్, ప్యాడీ మొబైల్ డ్రైయర్, స్ట్రా బేలర్, రోటరీ ష్రెడర్, మల్చర్, రోటరీ స్ట్రా స్లాషర్, బ్రష్ కట్టర్ ఉన్నాయి. రైతుల అవసరాలు, సాగు విధానాల్లో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని పథకం అమలు మధ్యలో కూడా రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ పరికరాలను చేర్చుకునేలా విధానాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
యాంత్రీకరణలో ఎఫ్‌పీవోలకు కీలక పాత్ర
వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను(ఎఫ్‌పీవోలను) భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎఫ్‌పీవోల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని, వాటిని పథకం అమలులో ఎలా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులు ప్రతి వ్యవసాయ పరికరాన్ని సొంతంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ పరికరాలను రైతులకు అద్దెకు అందించే అవకాశాన్ని పరిశీలించాలని కూడా ఆదేశించారు. ఒక్క రైతు ఖరీదైన యంత్రాన్ని కొనుగోలు చేయడం కంటే ఒక ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో పరికరాలను అందుబాటులో ఉంచి అవసరమైన సమయంలో రైతులకు అద్దెకు అందిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువమంది యాంత్రీకరణ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. పథకాన్ని మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు రైతుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’లో ఈ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ఎఫ్‌పీవోల ప్రతినిధులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా పథకానికి తుది రూపం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




