హాస్పిట‌ల్స్‌లో మౌలిక వ‌స‌తుల పెంపున‌కు చ‌ర్య‌లు

– మరో 9 హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ సేవలు
– 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు
– అదనంగా 485 వెంటిలేటర్ల ఏర్పాటు
– శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ఎంఆర్‌ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా 485 వెంటిలేటర్లను కూడా కొనుగోలు చేసి అవసరమైన హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు గురువారం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం గాంధీ, ఉస్మానియా, నిమ్స్, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో తొమ్మిది ఎంఆర్‌ఐలు, 50 సీటీ స్కాన్ యంత్రాలు, 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్తగా నిజామాబాద్ జీజీహెచ్, సిద్దిపేట జీజీహెచ్, సూర్యాపేట జీజీహెచ్, నల్గొండ జీజీహెచ్, మహబూబ్‌నగర్ జీజీహెచ్, నీలోఫర్ తదితర హాస్పిటల్స్‌లో ఎంఆర్‌ఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. గాంధీ, ఉస్మానియాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో అక్కడికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అదనపు ఎంఆర్‌ఐ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా తొమ్మిది అత్యాధునిక టెక్నాలజీతో కూడిని 3టెస్లా ఎంఆర్‌ఐ యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం 50 ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, కొత్తగా మరో 8 హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 1,770 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైనచోట అదనంగా 485 వెంటిలేటర్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ

వైద్య పరికరాలను కొనుగోలు చేయడం మాత్రమే కాక అవి నిరంతరం పనిచేసేలా చూడటానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. వైద్య పరికరాల కొనుగోలు, సరఫరా, నిర్వహణకు సంబంధించిన వివరాలను పర్యవేక్షించేందుకు ఈ-ఉపకరణ్ అనే వెబ్ ఆధారిత పరికరాల జాబితా, నిర్వహణ వ్యవస్థను వినియోగిస్తున్నామని తెలిపారు. వైద్య పరికరాల పనితీరు, నిర్వహణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టీజీఎంఎసఐడీసీలో ప్రత్యేక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పీఎంయూ ద్వారా పరికరాలను క్రమం తప్పకుండా ఆడిట్ చేసి వాటి పనితీరు, వర్కింగ్ కండీషన్, నిర్వహణ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సమయంలో సర్వీసింగ్, రిపేర్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రిపేర్లు తక్షణమే జరిగేలా. బయోమెడికల్ ఇంజనీర్లను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు. వైద్య పరికరాలు నిరంతరం పనిచేయాలంటే శిక్షణ పొందిన టెక్నీషియన్లు కీలకమని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో గత రెండున్నరేళ్లలో 1,500 మందికి పైగా టెక్నీషియన్లను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించామని వెల్లడించారు. అవసరమైనచోట కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో టెక్నీషియన్లను నియమిస్తున్నామని మంత్రి తెలిపారు.

 నూతన ఉద్యోగుల ఆరోగ్య  పథకం 
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్‌ఎస్)  అమలు చేస్తున్నామని మంత్రి దామోదర్ తెలిపారు. 2026 జూలై 17 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని మంత్రి తెలిపారు. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన నూతన ఈహెచ్‌ఎస్ ట్రస్ట్(ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశామని చెప్పారు. 30 మంది సభ్యులతో ఉన్న ఈ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి 10 మంది, పెన్షనర్ సంఘాల నుంచి ముగ్గురు, ప్రభుత్వం నుంచి 16 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ బేసిక్ పే/చివరగా పొందిన పెన్షన్‌లో 1.5 శాతం చొప్పున నెలకు చెల్లిస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా ఇస్తోందని మంత్రి తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి నెలకు రూ.44 కోట్లు, ప్రభుత్వం నుంచి మరో రూ.44 కోట్లు కలిపి నెలకు రూ.88 కోట్లు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ పథకానికి ఏడాదికి రూ.1,056 కోట్ల బడ్జెట్ ఉందని తెలిపారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 921 దవాఖానల్లో ఇన్‌పేషెంట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇందులో 114 ప్రభుత్వ, 807 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పారు. పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్ల ప్రీ-ఆథరైజేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ పథకం పరిధిలో 17 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి డిజిటల్ ఆరోగ్య కార్డులను వెబ్ పోర్టల్ ద్వారా జారీ చేస్తున్నామని చెప్పారు. ఓటీపీ ద్వారా స్వయంగా హెల్త్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని, ఉద్యోగులు కోరుకున్న విధంగా ఆరోగ్య సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
37 వెల్‌నెస్ కేంద్రాల ఏర్పాటు
ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఓపీ వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందించేందుకు ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. మరో 25 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో 21 జిల్లాల్లో, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరిలో అధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో మొత్తం వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు చేరుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *