మహిళా శక్తికి ప్రతీక బతుకమ్మ

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– అంబర్‌పేటలో ఘనంగా మహిళా సదస్సు
– 2029 నాటికి ‘నషా ముక్త భారత్’ లక్ష్యం
– నవంబర్‌లో హైదరాబాద్‌లో పాదయాత్ర

అంబర్‌పేట, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 6 : కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళా శక్తికి సజీవ ప్రతీక అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కొనియాడారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం అంబర్‌పేట ప్రాంత ప్రజలంతా బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంబర్‌పేటలో మంగ‌ళ‌వారం నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చరిత్రలో నిజాం పాలనకు, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని ధీరోదాత్తమైన పోరాటాలు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నిజాం ప్రైవేట్ ఆర్మీ మన ఆడబిడ్డలపై చేసిన దౌర్జన్యాలు చారిత్రక చీకటి రోజులుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము దేశ రాష్ట్రపతిగా, తెలంగాణ కోడలు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. విమానాలు, యుద్ధ విమానాలు నడపడంతో పాటు సైనిక రంగంలోనూ, బహుళజాతి కంపెనీల సారథ్యంలోనూ మహిళలు ముందున్నారని పేర్కొన్నారు. ఇటీవలి ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలలో అత్యధికం మన మహిళలే సాధించి దేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారని అభినందించారు. హైదరాబాద్ ఐటీ రంగంలోనూ ఆడబిడ్డల పాత్ర కీలకమని కొనియాడారు.

మహిళా సంఘాలకు రూ. 20 లక్షల రుణాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తోందని, పొదుపు సంఘాలకు (స్వయం సహాయక సంఘాలు) రూ. 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తూ తగిన ప్రోత్సాహం అందిస్తోందని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నతంగా చదివించి, వారి లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం నవంబర్‌లో పాదయాత్ర

రాష్ట్రంలో యువత, పిల్లలు గంజాయి, డ్రగ్స్ బారిన పడుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ తరహా పరిస్థితులు తెలంగాణలో తలెత్తకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని హెచ్చరించారు. 2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా (నషా ముక్త భారత్) మార్చాలని ప్రధాని మోదీ సంకల్పించారని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా వచ్చే నవంబర్ లో హైదరాబాద్‌లో రాజకీయాలకు అతీతంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రలో తెలంగాణ ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *