స్కాలర్ షిప్ బడబ్బులు లేక విద్యార్థులు అవస్థలు
•ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం :మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని.మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతోందన్నారు. ఇదే విషయమై డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారు.
ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తుంది, ఇప్పటివరకు బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవు. రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడం పై లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని హరీస్ రావు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదు. ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయింది. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్లగా, మరికొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పథకంలో ఎంపిక అవుతామేమో అనే ఆశతో ఇక్కడే ఉండి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని మాజీమంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.





