మాదక ద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం

– గవర్నర్‌తో మంత్రి అడ్లూరి కీలక భేటీ
– ‘నషా ముక్త్ భారత’, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగుల సాధికారతపై చర్చ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: మాదకద్రవ్యాల బారిన పడకుండా యువతను కాపాడేందుకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, వృద్ధుల సంక్షేమం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై గవర్నర్‌తో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లోక్‌భవన్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం, రాష్ట్రంలో చేపడుతున్న మాదకద్రవ్యాల నిరోధక చర్యలు, యువతలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై మంత్రి గవర్నర్‌కు వివరించారు. ఈ నెల 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు, యువజన చైతన్య కార్యక్రమాల వివరాలను గవర్నర్‌కు తెలిపారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా గవర్నర్‌ను ఆహ్వానించారు. అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా హాజరుకాలేనని, జూలై 2న వరంగల్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటానని గవర్నర్ తెలిపారు. వృద్ధుల సంక్షేమం, ఒంటరిగా జీవిస్తున్న సీనియర్ సిటిజన్ల సమస్యలు, ప్రణామ్ డే కేర్ కేంద్రాల సేవలు, వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై కూడా చర్చించారు. దివ్యాంగుల సాధికారతకు సంబంధించి రాష్ట్రం అమలు చేస్తున్న బాల భరోసా, సహాయక పరికరాల పంపిణీ, స్వయం ఉపాధి పథకాలు, దివ్యాంగుల వసతి గృహాలు, ప్రత్యేక పాఠశాలల నిర్వహణ, విద్యావకాశాల విస్తరణ తదితర అంశాలను మంత్రి వివరించారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల కల్పన, ఆరోగ్య సేవల విస్తరణ వంటి అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. అత్యంత బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్ అభినందిస్తూ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, వృద్ధుల గౌరవప్రద జీవనం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల సాధికారతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంచాలకురాలు బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.]


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *