హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులన్నీ 2028 మార్చి వరకు పూర్తి చేస్తామని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామికవాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌లు న్యూదిల్లీ నుంచి సోమవారం నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) వీడియో కాన్ఫరెన్సులో సచివాలయం నుంచి శ్రీధర్‌బాబు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల మంత్రులు పాల్గొన్నారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు వివరించారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం ఉండగా కేంద్ర ప్రభుత్వం అభివృధ్ది పనులకు నిధులు అందజేస్తోంది. ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కు అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్టు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఇపిసి) పద్ధతిలో జరగుతున్న పనులు ముందుగా నిర్ణయించిన సమయానికి పూర్తవుతాయిని వెల్లడించారు. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. విద్యుత్తు సరఫరా పనులను కూడా గడువులోగా పూర్తి చేస్తామని వివరించారు. భవ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణాకు కేటాయించాలని మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీధర్‌బాబు కోరారు. వీడియో కాన్ఫరెన్సులో టిజిఐఐసి ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, పరిశ్రమల కమిషనర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





