అక్షర శతాగ్ని ‘కాళోజీ’

‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ ఈ మాట కేవలం ఒక శబ్ద విన్యాసం కాదు, అణచివేతకు గురైన గుండెల నుంచి ఎగిసిపడిన చైతన్య స్ఫోరక నినాదం! కాళోజీ నారాయణరావు అనే పేరు వినగానే ఒక కవి ప్రతిరూపం కన్నా, అన్యాయాన్ని జుట్టు పట్టుకుని నిలదీసే అక్షర ధనుర్ధారి రూపమే స్ఫురిస్తుంది. తెలంగాణ నేల కన్న నిస్వార్థజీవి, నిజాం నిరంకుశత్వం నుంచి ప్రజాస్వామ్య ముసుగులోని దొరతనం వరకు పాలకులందరినీ అక్షర శస్త్రాలతో చెండాడిన  ధీరోదాత్త కవి కాళోజీ. తెలంగాణా జనం గుండెల్లో ‘కాళన్న’గా చెరగని ముద్ర వేసుకున్న ఈ ప్రజాకవి భౌతికంగా మనకు దూరమై ఏళ్లు గడుస్తున్నా, ఆయన రాసిన కవితా పంక్తులు నేటికీ సామాజికస్పృహకు నిత్య నూతన దిక్సూచిగా నిలిచి ఉన్నాయి.

తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఆంగ్లభాషల్లో అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ, కాళోజీ తన కవిత్వానికి వేదికగా ఎంచుకున్నది శ్రమజీవుల గొంతును, మాతృభాషలోని అసలైన యాసను. మాతృభాషను కించపరిచే మనస్తత్వంపై ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రం కాలం మారినా నిత్య సత్యం. “అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా” అంటూ ఆత్మన్యూనతతో బతికే ఆంధ్రులను తీవ్రంగా హెచ్చరిక  చేశారు. బతుకమ్మ సంస్కృతిని కేవలం పూలపండుగగా కాక, తెలంగాణ ప్రజల ఐక్యతా లక్ష్యసిద్ధికి ప్రతీకగా చాటుతూ, “చెలిమి చెలమలు ఊరేదాకా/ చెలిమి కలుములు నిలిచేదాకా/ చెలిమి వెన్నెలలు కాసేదాకా/ చెలిమి రాగములు ఒలికేదాకా” అంటూ సాంస్కృతిక వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

కాళోజీ కవిత్వం అంటే ఊహాజనిత సౌందర్యం కాదు, అది పీడితుల పచ్చి నిజాల దర్పణం. ‘వ్యత్యాసాలు’ కవితలో ఆయన చిత్రించిన సామాజిక అంతరాలు నేటికీ పాలకులను నిలదీస్తూనే ఉంటాయి. “అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట / హంసతూలికలొకచోట అలసిన దేహాలొకచోట” ఈ ఆర్థిక వ్యత్యాసాల వెనుక ఉన్న దగాను కళ్ళకు కట్టిన ఆయన, లోకానికి తిండిపెట్టే రైతు ప్రతిభను ‘కర్షకా’ కవితలో బల్లగుద్ది చెప్పారు. గురువులైనా, గోవిందుడైనా కర్షకుడి కర్రు కదిలితేనే మనుగడ సాగిస్తారన్న సత్యాన్ని చాటారు. అలాగే పరిపాలకులు మారినా మారని దోపిడీస్వభావాన్ని ఖండిస్తూ, “బాధ్యత లేని ప్రభుత్వ భటులు/ పెట్టే బాధలు చాలింక/ బాధ్యత గల పరిపాలన లేక/ బ్రతికిన బతుకులు చాలింక/ దొంగలంత దొరతనం పేరిట/ చేసిన దోపిడీ చాలింక” అంటూ రాజ్యాధిపత్యంపై హెచ్చరికల విల్లంబులు ఎక్కుపెట్టారు.

స్వాతంత్య్రానంతర దేశంలో సిద్ధాంతాలకు, ఆచరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ “చేతకు సిద్ధాంతానికి చీమ, ఏన్గు తేడాయని/ వట సావిత్రీవ్రతం వారకాంత చేస్తుందని/ ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు” అని నాటి రాజకీయ నాయకుల ద్వంద్వనీతిని తుత్తునియలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పుడు ‘ఇంతకన్నా చావునయం’ అని భయపడకుండా రాసిన ధైర్యం ఆయనది. 1969 తెలంగాణా ఉద్యమంలో స్వయంగా పాల్గొని, జీవితాంతం అసలు సిసలైన తెలంగాణవాదిగా జీవించిన కాళోజీ, ప్రాంతం పేరుతో నయవంచన చేసే స్వదేశీ దోపిడీదారులను కూడా వదల్లేదు. “దోపిడీచేసే ప్రాంతేతరులను- దూరందాకా తన్ని తరుముతం/ ప్రాంతంవాడే దోపిడి చేస్తే- ప్రాణంతోనే పాతర వేస్తాం” ఈ మాటలు కాళోజీ నిష్పాక్షికతకు, వర్గరహిత ఆశయాలకు నిలువెత్తు నిదర్శనం.

స్త్రీలపై జరిగే అరాచకాలు, లైంగిక వేధింపుల పట్ల కాళోజీ కవిత్వం ఆక్రోశంతో రగిలిపోయింది. “కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె/ కన్నుగీటిన కళ్ల కారాలు చల్లాలె/ కండకండగ కోసి కాకులకు వెయ్యాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె” అపరాధుల పట్ల కరుణ చూపాల్సిన అవసరం లేదని, కఠిన శిక్షలు విధించాల్సిందేనని పట్టుపట్టిన ఆయన స్పందన నేటి సమాజానికి మరింత ప్రాసంగికం. అవకాశవాద రాజకీయనాయకుల నకిలీ ధోరణిని “నేనెప్పుడూ గెలిచినోని బాపతు/ ఓడినోనితో జలసూతకాలు రద్దు/ రాజీలోచనుణ్ణి నేను” అంటూ కేవలం ఒక్క కవితతో తీవ్రంగా నిలదీసారు .

కాళోజీ ఆలోచనా సరళిలో అద్భుతమైన తాత్వికత అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ‘నరుడ నేను’ కైతలో “లోకేశునకును జడియను/ లౌకికమని వెనుదీయను/ ఆశలన్ని యుడుగునట్లు/ హాయిగ జీవించుతాను” అని నిర్భయమైన స్వేచ్ఛామానవుడి మార్గాన్ని చాటారు. ‘పునరావృతి’లో “చీకటిలో కనువిప్పినవారికి వెలుతురంటె బూచి/ వెలుతురులో కనుతెరిచిన వారికి చీకటంటే పిశాచి” అంటూ మనిషి కష్టసుఖాల చక్రబంధనాన్ని ఎరుకపరిచారు. ‘బ్రతుకు’ కవితలో “బ్రతకదలచిన పోరు సుతరాం తప్పదు/ చూపతలచిన వారు రేపనుట ఒప్పదు” అంటూ పోరాటమే ఊపిరిగా బతికే తత్త్వాన్ని నూరిపోశారు.

సమకాలీన రాజకీయం ఎన్నైనా మలుపులు తిరగవచ్చు, కానీ కాళోజీ ‘నా గొడవ’ సమాజానికి ఎప్పుడూ ఒక విశాలమైన ఐక్యతా వేదిక. “నానా భావన నది- నీనా భావన లేనిది/ మన భావన నది- సమభావన నది/ సమరస భావన నది-నా గొడవనునది / కాళోజీ అనునది” ఇక్కడ కవి తనగొడవలో అందరి గొడవను, సామరస్యాన్ని ఆకాంక్షించారు. గాంధీ ప్రభావంతో “నీ మాట మాటుననె మా మాట పలికితిమి/ నీ అడుగులను జూపి మా అడుగు వేసితిమి” అని గాంధేయవాదాన్ని స్మరించుకున్నా, జయప్రకాష్ నారాయణ్ త్యాగాన్ని “పుటుక నీది/ చావు నీది / బ్రతుకంతా దేశానిది” అనే ఏకవాక్య మహోన్నత కవితతో దేదీప్యమానంగా వెలిగించారు.

కళ సామాన్యుడి కోసం, సమాజ శ్రేయస్సు కోసమే ఉండాలని నమ్మిన కాళోజీ, ‘హార్టిస్టే ఆర్టిస్టు’ కవితలో “హార్టిస్టు కానివాడు/ ఆర్టిస్టు కాగలడా?” అని ప్రశ్నిస్తూ హృదయ నైర్మల్యత ఉన్నవాడే నిజమైన కళాకారుడని తేల్చి చెప్పారు. ‘కలంగారడీ కైతల వలలల్లకు’ అంటూ సామ్యవాద సమాజాన్ని కాంక్షించే కవి ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని దిశానిర్దేశం చేశారు. 2002 నవంబర్ 13న కాళోజీ భౌతికంగా నిష్క్రమించినా, ఆయన కవనస్ఫూర్తి తెలంగాణా సమాజంలో నిత్యం ప్రవహిస్తూనే ఉంది. నిస్వార్థ జీవి, నిరంతర చైతన్యమూర్తి అయిన కాళోజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి- ఆయనలాగే అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా, అక్షరాన్ని నిరసన స్వరం చేయడం.

(నవంబర్ 13న కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా)

పిళ్లా తిరుపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *