రెక్కలు తొడగాలి‘పసుపుకొమ్ము నవ్వింది’ ఎవరి మీద?

ఏ కథలోనైనా చెప్పదలచుకున్న విషయాలతోపాటు, పాత్రలూ సంఘటనలూ రచయిత ఉద్దేశానికి మించి ఏమైనా చెబుతున్నాయా? ఒక పాత్ర నిజాయితీని చిత్రిస్తూనే, ఆ పాత్ర ప్రాతినిధ్యం వహించిన వ్యవస్థలోని అసమానతలను కథ సమర్థిస్తోందా? ఒక స్త్రీ నిర్ణయాన్ని ధైర్యానికి ప్రతీకగా చూపిస్తూనే, ఆ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులే ఆమె స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయా? ఈ తేడాలను గుర్తించినప్పుడే కథ సాధించినదేమిటో, సాధించలేనిదేమిటో తెలుస్తుంది. ముక్కామల చక్రధర్ రాసిన ‘పసుపుకొమ్ము నవ్వింది’ కథని ఈ దృష్టితో పరిశీలిస్తే కొన్ని లోతైన ప్రశ్నలెదురవుతాయి.

వంశపారంపర్య కరణీకం రద్దు కావడంతో కొప్పేశ్వరరావు కుటుంబం హోదాను కోల్పోవడం, కొడుకు చిన మహదేవుడి బాధ్యతారాహిత్యం, కోడలు జానకి ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం, చివరికి సమాజం చిన్నచూపు చూసే ఆచారపరమైన పనిని ఆమె స్వీకరించడం- ఇవే ఈ కథలోని ప్రధాన పరిణామాలు. వీటి వెనుకున్న అధికార సంబంధాలనూ, శ్రమ విలువనూ, స్త్రీ వైవాహిక గుర్తింపుపై సమాజం విధించే నియంత్రణలనూ కథ ఎంతవరకు ప్రశ్నించిందన్నదే ఇక్కడి పరిశీలన.

కథ ప్రారంభంలో తెల్లచొక్కా, తెల్లపంచే, ముఖంపై చిరునవ్వూ, వెనుక కమలాపండు రంగు ఆకాశమూ, ముందు ఆకుపచ్చని పొలాల్లాంటి వర్ణనలతో కొప్పేశ్వరరావును ఆదర్శవంతుడిగా పరిచయం చేస్తారు రచయిత. భూమి కొలతల్లో మూడు లింకులు కలిపివేయమని రమేష్ అనే వ్యక్తి ఎంత కోరినా, అలా చేస్తే తన కొడుక్కి అతనిచ్చే లంచం భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పి ఆశచూపినా నిరాకరిస్తాడు. ఇది ఆయన నిజాయితీకి నిదర్శనం. అయితే, ఒకవ్యక్తి నిజాయితీపరుడైనంత మాత్రాన ఆయన పనిచేసిన వంశపారంపర్య అధికార వ్యవస్థ న్యాయబద్ధమైపోతుందా? ఆ గ్రామాధికారంలో అందరికీ సమాన భాగస్వామ్యముందా? వ్యక్తిగత మంచితనానికీ వ్యవస్థాగత న్యాయానికీ మధ్యనున్న ఈ తేడాను కథ పరిశీలించదు. కొప్పేశ్వరరావు నిజాయితీని ఆదర్శంగా చూపడం తప్పుకాదు గానీ, దానిచుట్టూ ఉన్న అధికార అసమానతలను విస్మరించడం వల్ల కథ సామాజిక దృష్టే పరిమితమవుతుంది.

కరణీకం రద్దుతో కొప్పేశ్వరరావు ఆదాయంతో పాటు సామాజిక గుర్తింపునూ కోల్పోతాడు. ఈ సంక్షోభాన్ని కథ సహజంగా చిత్రించినా, వంశపారంపర్య అధికారాన్ని తొలగించాల్సిన ప్రజాస్వామిక అవసరాన్ని ప్రస్తావించదు. ఆ మార్పువల్ల జీవనాధారం కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం కల్పించాల్సిన భద్రతనూ ప్రశ్నించదు. పాత వ్యవస్థ రద్దుతో ఒక కుటుంబమెదుర్కొన్న నష్టాన్ని చూపడం సమంజసమే అయినా, ఆ వ్యవస్థలోని అసమానతలనూ, దాని రద్దు వెనుకున్న సామాజిక న్యాయ అవసరాన్నీ పక్కనపెడితే కథనం ఏకపక్షమవుతుంది.

మహదేవుడి కాలంనాటి లంకంత ఇల్లూ, నౌకర్లూ, నిత్యాగ్నిహోత్రమూ, విందులూ.. అన్నీచూస్తే గత వైభవాన్ని కోల్పోయిన కుటుంబంపై సానుభూతి కలుగుతుంది కానీ, ఆ వైభవాన్ని నిర్మించిన శ్రమ ఎవరిదో, ఆ నౌకర్ల జీవితాలేమయ్యాయో మనకు పట్టదు. అట్టడుగువర్గాలు తరతరాలుగా అనుభవించిన, అనుభవిస్తోన్న పేదరికానికీ, అధికారహోదాని కోల్పోయి పేదరికంలోకి జారిన కుటుంబమెదుర్కొన్న దుస్థితికీ మధ్య తేడా ఒకటికాదుగా! ఒకరి వైభవం మరొకరి శ్రమపై నిర్మితమైందన్న సత్యాన్ని కథ గుర్తించలేకపోయింది.

చిన మహదేవుడిలో వారసత్వగర్వం తప్ప బాధ్యత ఏ కోశానా ఉండదు. తండ్రి సంపాదనపై ఆధారపడుతూ, తాగుడుకు అలవాటుపడీ, చివరికి భార్యాబిడ్డల్నే వదిలెళ్లిపోతాడు. బాధ్యత తెలియని మగాడికి పెళ్లి చేస్తే బాధ్యత తెలుస్తుందని జానకిని అతనికిచ్చి కట్టబెడతారు. అయినా మార్పు రాదు. ఈ నిర్ణయానికి బలైన స్త్రీ జీవితాన్ని కుటుంబమూ, దాన్ని నిర్ణయించిన సమాజమూ పట్టించుకోలేదు. మహదేవుడి బాధ్యతారాహిత్యాన్ని చిత్రించిన కథే, అందుకు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించడంలో వెనుకబడింది. పితృస్వామ్యం మగవాడి బాధ్యతారాహిత్యంలోనే కాక, దాన్ని సహజంగా అంగీకరించే కుటుంబ నిర్మాణంలోనూ ఉంటుంది.

కరణీకం రద్దయినప్పుడు అండగా ఉంటామని చెప్పినవారంతా కాలంతోపాటే దూరమవుతారు. మాటల్లోని సానుభూతికీ ఆచరణలోని బాధ్యతకీ మధ్య దూరాన్ని రచయిత బాగా పట్టుకున్నారు. ఆదాయం కోల్పోవడం, వృత్తి మార్పుకు భద్రత లేకపోవడం, కొడుకు బాధ్యత తీసుకోకపోవడం లాంటి ఈ సంక్షోభాలే కొప్పేశ్వరరావు చావుకి నేపథ్యం. వ్యక్తిగత విషాదం వెనుక సామాజిక కారణాలను గుర్తించినప్పుడే కథకి లోతొస్తుంది.

కొప్పేశ్వరరావు చావుతో కథ జానకి జీవితంపైకి మళ్లుతుంది. భర్త వదిలి వెళ్లడం, ఆర్థిక ఇబ్బందులు, పుట్టింటివారి సహాయ సహకారాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఆమెను సంక్షోభంలోకి నెడతాయి. బంగారు పుస్తెలతాడు స్థానంలో పసుపుకొమ్ము కట్టుకోవాల్సొచ్చిందనే ఆమె మాట, కుటుంబ పతనం స్త్రీ జీవితంపై మచ్చగా ఎట్లా మారుతుందో చూపిస్తుంది. కానీ ఆమె నిస్సహాయతకు కారణం బంగారు పుస్తెలతాడా? కాదు. స్వంత ఆదాయం లేకపోవడం, ఆస్తిపై హక్కు లేకపోవడం, గృహశ్రమకు ఆర్థిక గుర్తింపులేవీ లేకపోవడమే అసలు సమస్యలు. స్త్రీని వైవాహిక గుర్తింపుతో కొలిచే సమాజంలో ఆ గుర్తింపే దెబ్బతింటే ఆమె మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఇంటి వెనుక చేతిపంపు చుట్టూ పేరుకున్న మట్టినీ బురదనూ గునపంతో తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేసే సన్నివేశం జానకి చర్యాశీలతను చూపిస్తుంది. అయితే తన జీవితాన్ని చుట్టుముట్టిన సామాజిక అసమానతలనూ ఆమె అంతే సులభంగా తొలగించగలదా? వ్యక్తిగత తెగువను ప్రశంసిస్తూనే దాన్ని పరిమితం చేసే నిర్మాణాలను ప్రశ్నించకపోతే ఆ చిత్రణ అసంపూర్ణంగానే మిగులుతుంది. జానకి పోరాటం కేవలం ధైర్యానికి సంబంధించినదే కాదు, ఈ బంధనాల మధ్య మనుగడ సాగించడానికి చేసే అస్తిత్వ పోరాటం కూడా.

పక్షవాతంతో బాధపడుతున్న భర్తను పోషించడానికి అన్నపూర్ణమ్మ పునిస్త్రీల పన్నెండోరోజు ఇచ్చే మూసి వాయినాలు స్వీకరిస్తూ బతుకుతుంది. సమాజం ఆమె శ్రమను అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూనే, ఆమెను శుభకార్యాలకు దూరంగా ఉంచుతుంది. శ్రమను స్వీకరిస్తూ శ్రమించే స్త్రీనే అవమానించే ఈ ద్వంద్వ నైతికతలో వైవాహిక స్థితీ, శుభాశుభాల భావనలూ, కులాచారాలూ, స్త్రీ శరీరంపై సామాజిక నియంత్రణలూ- అన్నీ ముడిపడున్నప్పుడు, కథ ఈ సంబంధాలను ఏమాత్రమూ లోతుగా పరిశీలించలేదు.

అన్నపూర్ణమ్మ చావు తర్వాత ఆమె స్థానంలో జానకి ముందుకొచ్చినప్పుడు, భర్త ఉన్నాడో లేడో తెలియని స్త్రీ వాయినం తీసుకోవచ్చా అని ఒక పుణ్యాంగన సందేహిస్తుంది. పక్కనున్న వ్యక్తి ఆమె భర్త శ్రీశైలంలో కనిపించాడని చెప్పడంతో జానకి వాయినానికి ఏ అడ్డూరాదు. ఇది కథలో పెద్ద వైరుధ్యం! భార్యను వదిలేసిన భర్త ఆమె బాధ్యతలు నిర్వర్తించకపోయినా, అతని ఉనికే ఆమె ఆచారపరమైన అర్హతను నిర్ణయించేస్తుంది. తన జీవనోపాధిని ఎంచుకోవడానికీ భర్త ఉనికినే నిర్ధారించుకోవాల్సిన దుస్థితి ఇది.

సమాజం అవమానంగా చూసే పనిని స్వీకరించడం జానకి ధైర్యమే! కానీ, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛకీ, ఆ నిర్ణయం ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడానికీ తేడా ఉంది. ఆ పనిద్వారా వచ్చే ఆదాయంపై ఆమెకు స్వతంత్ర హక్కెంత? కూతురి భవిష్యత్తుకు భద్రతెంత? ఇంతకీ జానకి ఎంచుకున్న పని గౌరవప్రదమైనదా కాదా అన్నది కాదు ప్రశ్న, ఆ పనిచేసే స్త్రీని అవమానించే సమాజపు నైతికత ఏమిటన్నదే ప్రశ్న. ఆమెకు చదువూ, ఆస్తీ, ఆదాయం, సామాజిక అండా లేకపోయినప్పుడు ఈ ఒక్కదారే మిగిలిందా? దీన్ని స్వేచ్ఛా ఎంపికగా చూట్టం కంటే, ఆమెకున్న పరిమిత అవకాశాల్లో మిగిలినదారిగా గుర్తించడమే వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఆ ధైర్యం వెనుకున్న తప్పని పరిస్థితిని చూడకుండా ఊరికే పొగిడితే, ఆమెనా స్థితికి నెట్టిన సమాజం మాత్రం ప్రశ్నకు దూరమవుతుంది.

కథ ముగింపులో జానకి, “ముందు ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లాలి కదండి” అంటూ పసుపుకొమ్మును చూసి నవ్వుతుంది. ఆ నవ్వులో ఆకలి వాస్తవికతతోపాటు పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసమూ ఉన్నాయి. దీనికి ముందొకాయన, “అవునూ మీరు ఆరువేల నియో…” అంటూ ఆమె కులగుర్తింపును ప్రస్తావించబోతాడు. ప్రశ్న పూర్తికాకముందే జానకి ఆకలిని ముందుకు తెస్తుంది. కులగుర్తింపుకీ, ఆచార అర్హతకీ, ఆకలితో బతకాల్సిన అవసరానికీ మధ్య వైరుధ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పసుపుకొమ్ము ఒక్క వైవాహిక గుర్తింపుకే ప్రతీకకాదు, బంగారు పుస్తెలతాడు స్థానంలో వచ్చిన పేదరికానికీ, భర్త ఉనికితోనే తన అర్హత నిర్ణయించబడుతున్న స్త్రీ స్థితికీ సంకేతం. ఆమె నవ్వు ధిక్కారమా, నిరసనా, ఆకలి ముందు గుర్తింపులన్నీ చిన్నవేననే జీవిత వాస్తవానికి ప్రతిస్పందనా, లేక మిగిలిన అవకాశాల పరిమితిని గుర్తించిన విషాదమా? ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం ఉండకపోవచ్చు. ఆ నవ్వులోని వైరుధ్యమే కథ ముగింపుకు బలం. ‘పసుపుకొమ్ము నవ్వింది’ పూర్తిగా విఫలమైన కథేమీ కాదు. ఒక కుటుంబం పతనాన్నీ, ఒక స్త్రీ ధైర్యాన్నీ సహజంగా చిత్రించింది కానీ, వ్యక్తిగత నిజాయితీని చూపిస్తూనే వ్యవస్థాగత అసమానతలనూ, స్త్రీ ధైర్యాన్ని చిత్రిస్తూనే దాన్ని పరిమితం చేసే పరిస్థితులనూ తగినస్థాయిలో పరిశీలించలేదు. కథ సాధించినదానితోపాటు సాధించలేనిదాన్ని గుర్తించినప్పుడే దాని నిజమైన విలువ తెలుస్తుంది.

బాలాజీ పోతుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *