– ఉపాధి హామీ పనులపై మంత్రి సీతక్క స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సమాధానాలు చెప్పడం కాకుండా క్షేత్రస్థాయిలో పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలు, ప్రత్యేకించి గిరిజనులకు జాబ్ కార్డులు అందించడంలో ఆలస్యం చేస్తే సంబంధిత ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజనులు ఒక్కసారి దరఖాస్తు చేసుకున్నా అధికారులు వెంటనే స్పందించాలని, దరఖాస్తులను తిరస్కరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఆర్డీఓలు, ఈఈలు, డీఈలు, ఎంపీడీవోలు సమీక్షలో పాల్గొన్నారు.
ఎనిమిది నెలల కార్యాచరణ ప్రణాళిక
రాబోయే ఎల్‌నినో, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎనిమిది నెలల సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ ప్లాన్ ఉండాలని సూచించారు. 29 లేదా 30 నాటికి మండల స్థాయి కమిటీల ఆధ్వర్యంలో పనుల ఎంపిక, ప్రణాళికలు పూర్తి చేసి నవంబర్ 1 నాటికి ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని స్పష్టమైన టైమ్‌టేబుల్ విధించారు. ప్రభుత్వం గుర్తించిన 318 రకాల పనుల్లో స్థానిక అవసరాలకు తగినట్లుగా 50 రకాల పనులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సమకూరేలా పాఠశాల ప్రహరీ గోడలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామ సమైక్య భవనాలు, సామూహిక పశువుల నీటి తొట్టెలు, పశుగ్రాసం వంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ‘వీబీ-జీ రామ్ జీ’ కింద సౌర విద్యుత్ పనులను గుర్తించి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు కాలువల మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు. చిన్న రైతులు కూడా ఉపాధి హామీ పనులవైపు వచ్చే అవకాశమున్నందున తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రెండో పంటగా ఎక్కువ నీరు తాగే పంటలకు బదులు ఆరుతడి పంటలు వేసేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల ప్రణాళిక, అమలులో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లను భాగస్వాములను చేస్తూ ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి దొరికేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





