‘రైతు డిస్కం‘ దరఖాస్తును ఆమోదించొద్దు

– ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్‌రావు లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై పలు అభ్యంతరాలు తెలుపుతూ దానిని తిరస్కరించాలంటూ  బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌ రావు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు లేఖ రాశారు. తెలంగాణ సమాజంలో రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేం.. నాటి ఉమ్మడి పాలకులు అమలు చేసిన విద్యుత్తు సంస్కరణలే బషీర్‌బాగ్ కాల్పులకు దారితీశాయన్న విషయం విదితమేనన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్తు రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి భారీగా నిధులు కేటాయించి ఆ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా 2018 జనవరి 1 నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతాంగానికి నిరంతర, నాణ్యమైన ఉచిత విద్యుత్తును కేసీఆర్ అందించారన్నారు. ఫలితంగా వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్తు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతు డిస్కం పేరిట మూడో డిస్కం ఏర్పాటు చేస్తామని ప్రకటించి రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోందన్నారు. ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించే కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనలోని పలు లోపాలను ఆ లేఖ ద్వారా కమిషన్ దృష్టికి తీసుకె=చ్చారు. బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం విచారణ పూర్తికాకుండానే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. రైతు డిస్కం కావాలి అని రైతులు అడగలేదు.. రైతు సంఘాలు అడగలేదు.. ప్రజాప్రతినిధులు అడగలేదు.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక లేదు.. విద్యుత్ సంస్థల నుండి ప్రతిపాదన లేదు.. మరి ఆర్థికపరమైన అంశాలు జి.ఓ.44లో పేర్కొంటూ మూడో డిస్కం ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జీవో 44 పేరా 2లో యావరేజ్ బిల్లింగ్ రేటు, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్‌లో వ్యత్యాసం ఉందని, దీని వల్ల డిస్కంలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని చెప్పారు.. అంటే థర్డ్ డిస్కం ఏర్పాటు ఆర్ధికపరమైన విషయాల గురించి ఆలోచించి చేస్తున్నారు తప్ప రైతుల సంక్షేమం గురించి కాదని అర్థం అవుతోందని అన్నారు. ఈ కీలక నిర్ణయంపై అసెంబ్లీలో చర్చించకపోవడం దీనికి మరింత బలం చేకూరుస్తున్నదన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం, విస్తృత చర్చ నిర్వహించడం కమిషన్ బాధ్యతగా తాము భావిస్తున్నామని హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయంపై బహిరంగ విచారణను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. అన్ని జిల్లాల్లో రైతులు, ఉద్యోగులు, వినియోగదారులతో బహిరంగ విచారణలు నిర్వహించాలని కమిషన్‌ను కోరుతున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *