– ఇది దేశ చరిత్రలే ప్రథమం
– డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క
– రూ.3 కోట్ల విలువైన సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రులు
ఎర్రుపాలెం/మధిర, ప్రజాతంత్ర, మే 27 : మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో బుధవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు. మహిళా సంఘాల సభ్యులతో సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించి, వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పసుపు బాయిలర్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోందన్నారు. మాదాపూర్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం షాపులు కేటాయించడమే కాక రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల మహిళా సంఘాల భవనాలకు ఒకేరోజు ప్రజా ప్రభుత్వం భూమి పూజ నిర్వహించిందన్నారు. వెంకటాపురంలో మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో సుమారు రూ.3 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా మహిళా సంఘాలకు రోజుకు రూ.14,000 నుంచి రూ.15,000 వరకు ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించడమే కాకుండా సబ్సిడీని అందజేస్తోందన్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును డిస్కమ్‌లు కొనుగోలు చేసేలా పీపీఏ ఒప్పందాలు కూడా జరిగాయని ఆయన ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, 2030 నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. గతంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితి రూ.5 లక్షల వరకు మాత్రమే ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం ఈ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ దిశగా
రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లడంలో ప్రభుత్వం మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తోందని భట్టి అన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. 2023-24లో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లు ఉండగా ప్రస్తుతం 18,485 మెగావాట్లకు చేరుకుందన్నారు. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ముందస్తు ప్రణాళికల వల్ల ఎక్కడా కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మహిళలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీఆరఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఎర్రుపాలెం మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్, జమలాపురంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తోపాటు హెచ్‌పీ పెట్రోల్ బంక్, సోలార్ పవర్ ప్లాంట్, ఇండక్షన్ స్టవ్స్, పసుపు బాయిలర్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. కార్యక్రమంలో స్పెషల్ సీ¾ఎస్ దాన కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ఖమ్మం కలెక్టర్ దివాకర్, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, రెడ్కో వైస్ చైర్మన్ అండ్ ఎండీ అనిల, ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





