కర్నాటకలో మారుతున్న సమీకరణలు

– సిద్దరామయ్యను తప్పుకోవాలని అధిష్ఠానం సూచన
– రేపు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం
– 30న డీకే ప్రమాణం చేస్తారన్న ప్రచారం
– సిద్దరామయ్యను రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయం

న్యూదిల్లీ, మే 27: కర్నాటకం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. ఈనెల 30న శనివారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. వీరిలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఒకరు, ఓబీసీ వర్గానికి చెందిన మరొకరితోపాటు ఒక మహిళ ఉంటారు. కర్ణాటకలో నాయకత్వ మార్పునకు మార్గం సుగమం చేయాలని, జాతీయ స్థాయిలో కీలకమైన సంస్థాగత బాధ్యత చేపట్టాలని సిద్ధరామయ్యను అధిష్ఠానం కోరినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ నుంచి నేరుగా ఈ సందేశం రావడంతో సిద్ధరామయ్య సైతం పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల 28న అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌ను సిద్ధరామయ్య కోరారు. అదేరోజు తన రాజీనామా పత్రాన్ని అందజేసి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తారు. గురువారం అపాయింట్‌మెంట్ కోరిన మాట నిజమే అని సిద్ధరామయ్య సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఆయన పదవి నుంచి తప్పుకోనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తన కేబినెట్ మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్ మీట్‌ను గురువారం ఉదయం ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక వర్గాల సమాచారం. కాగా, దిల్లీలో ఉన్న డీకే శివకుమార్ బుధవారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకుని తిరిగి గురువారం హస్తినకు వెళ్తారు. ముఖ్యమంత్రి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది. అయితే ఆలోచించుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. డీకేకు సీఎం పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడంతో సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే ఎప్పటిలోగా ప్రమాణస్వీకారం చేస్తారనే అంశాలు ఆసక్తిరకంగా మారాయి. ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకదాని ప్రకారం ఈనెల 28న కానీ 29న కానీ సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. అదే జరిగితే 30న డీకే సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. రెండో ఆప్షన్ ప్రకారం సిద్ధరామయ్య  తప్పుకునే విషయంలో జాప్యం తలెత్తవచ్చు. అదే జరిగితే జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాతే ఆయన రాజీనామా చేయడం, డీకే సీఎం పగ్గాలు చేపట్టడం జరుగుతుంది. ఇక కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగాల్సి ఉండగా సంఖ్యాబలం ఆధారంగా మÖడు సీట్లను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. సిద్ధరామయ్యకు ఒక సీటును అదిష్ఠానం ఇప్పటికే ఆఫర్ చేసింది. రెండో సీటుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. మూడో సీటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కొత్త మంత్రివర్గంలో కనీసం ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాలని, తద్వారా పవర్ బ్యాలెన్స్‌కు వీలుంటుందని సిద్ధరామయ్య వర్గం ఆలోచనగా తెలుస్తోంది. డీకే చేతిలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆ వర్గం కోరుతున్నట్టు చెబుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *