– మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
– చరిత్రాత్మక మెగా జాబ్ మేళా ఘనంగా ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మైనారిటీల సంక్షేమ శాఖ, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్(టీజీఎంఎఫ్‌సీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మేళాను హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తోపాటు అన్ని విభాగాల అధికారులకు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో అమలుకాని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో వేగంగా అమలవుతున్నాయని తెలిపారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా కృషి చేస్తోందని, మైనారిటీల సంక్షేమ శాఖ, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ సమన్వయంతో మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర అన్ని మైనారిటీ వర్గాల యువతకు సమానావకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆఫర్ లెటర్ ఇవ్వడంతో తమ బాధ్యత ముగియదు.. అభ్యర్థి కంపెనీలో చేరే వరకు మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తాం.. యువతకు ఉపాధి కల్పించడం మా బాధ్యత, మా వాగ్దానం అని అజారుద్దీన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి మెగా జాబ్ మేళాలను నిర్వహించి మరింతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
యువత విద్యతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న వివిధ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘టీజీఎంఎఫ్‌సీ ద్వారా అనేక నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. యువత ఈ అవకాశాలను వినియోగించుకుని తమ ప్రతిభను పెంపొందించుకోవాలి.. ఇంటర్వ్యూలలో పాల్గొని మంచి ఉద్యోగాలు సాధించాలి.. కృషి, పట్టుదల, నైపుణ్యాలే విజయానికి మార్గం’ అని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మైనారిటీ గురుకులాల వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ, మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీఉల్లా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.
మెగా జాబ్ మేళా విశేషాలు
మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఎంపానెల్డ్ ట్రైనింగ్ భాగస్వామ్య సంస్థల సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించింది. ఈ మేళాలో 50 నుంచి 60 వరకు ప్రముఖ కంపెనీలు, హెచఆర్ ప్రతినిధులు పాల్గొని లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, రిటైల్ అండ్ హాస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ అండ్ అసెంబ్లీ, ఆటోమొబైల్ అండ్ మొబిలిటీ, నిర్మాణ-మౌలిక వసతులు, ఐటీఈఎస్/బీపీఓ, కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్‌కేర్, మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్‌లలో ఉద్యోగావకాశాలు కల్పించాయి. సుమారు 20 శిక్షణ సంస్థలు కూడా పాల్గొన్నాయి. గతంలో శిక్షణ పొందిన విద్యార్థులు, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,000 మంది మైనారిటీ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలతోపాటు కెరీర్ కౌన్సెలింగ్ సేవలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల నమోదు ప్రక్రియ కూడా నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




