హైడ్రాకు చట్టబద్ధ పాలన మీద నమ్మకం లేదా?

“దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే వివాదానికి కూడా దారితీస్తాయి. అందువల్లనే హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కనీసం 700 కేసులు తెలంగాణ హైకోర్టు ముందు దాఖలయ్యాయని తెలుస్తున్నది.”

హైదరాబాద్ లో అక్రమ భూ ఆక్రమణలను తొలగించడానికి, ప్రభుత్వ, ఉమ్మడి ఆస్తులను రక్షించడానికి, ప్రత్యేకంగా చెరువులను, కుంటలను కబ్జాల నుంచి రక్షించి, ఉత్పాతాలను నిరోధించడానికి ఏర్పాటయిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చట్టప్రకారం తనకు అందిన అధికారాల లోపలే బాధ్యత నిర్వహిస్తున్నదా, అసలు ఏ చట్టం దానికి ఆ అధికారాలు ఇచ్చింది, లేక తన పరిధులు దాటి మితిమీరి ప్రవర్తిస్తున్నదా అనే ప్రశ్నకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు రెండో జవాబు వైపే మొగ్గు చూపుతున్నట్టున్నారు.

దాదాపు రెండు సంవత్సరాల కింద ఏర్పాటైన ఈ కొత్త ప్రభుత్వ సంస్థ నగరంలో అనేక చోట్ల “అక్రమ ఆక్రమణలు” అనే పేరిట భవనాలను కూల్చివేయడం, స్థలాల చుట్టూ కంచెలు వేయడం వంటి చాలా పనులు చేసి వార్తలకెక్కింది. వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని, సామాజిక ఉద్యానవనాలను, రహదారులను కబ్జాల నుంచి విడిపించాననీ, ఒక్క సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోనే 860 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నానని, దాదాపు 200 ఎకరాల చెరువు శిఖం భూముల ఆక్రమణలను తొలగించానని, బంజారా హిల్స్ (ఐదు ఎకరాలు), కొండాపూర్ (36 ఎకరాలు), గాజుల రామారం (317 ఎకరాలు) వంటి ఖరీదైన భూములున్న ప్రాంతాలలో అక్రమ కట్టడాలను కూల్చివేశానని హైడ్రా చెప్పుకుంటున్నది.

మాదాపూర్ తమ్మిడికుంట ఫుల్ టాంక్ లెవల్ (ఎఫ్ టి ఎల్) ను కబ్జా చేశారనే కారణంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడాలను కూల్చివేసి, పెద్దల మీద కూడా చెయ్యి చేసుకుంటానని ఒక ఉదాహరణ చూపిన హైడ్రా, కొండాపూర్, గోల్కొండ కోట, పుప్పాలగూడ, హైదర్ నగర్, ఇంజాపూర్, యాప్రాల్ వంటి అనేక చోట్ల పేదల, మధ్యతరగతి ప్రజల నివాసాలను అక్రమ ఆక్రమణలు – నిర్మాణాల పేరుతో కూలగొట్టింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే వివాదానికి కూడా దారితీస్తాయి. అందువల్లనే హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా కనీసం 700 కేసులు తెలంగాణ హైకోర్టు ముందు దాఖలయ్యాయని తెలుస్తున్నది.

“తన రెండు సంవత్సరాల జీవితంలో హైడ్రా ప్రవర్తిస్తూ వచ్చిన పద్ధతి, హైడ్రా అధికారుల నిరంకుశత్వం, బాధితుల పట్ల దురుసుతనం, ఎటువంటి నోటీసులు, ముందస్తు హెచ్చరికలు లేకుండా ఏ తెల్లవారు జామునో లెక్కలేనన్ని బుల్డోజర్లతో ఇళ్ల మీద పడి, బాధితుల గోడు పట్టించుకోకుండా బీభత్సం సృష్టించడం, ఆ బీభత్సానికి ఎటువంటి చట్టపరమైన ఆమోదం లేకపోవడం వంటి అనేక అపసవ్యతలు హైడ్రా పని తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక అక్రమాన్ని సరిదిద్దడానికి ఏర్పడిన సంస్థ తానే అక్రమాలకు నిలయంగా మారుతున్నది.”

నగరంలో, చుట్టుపట్ల ప్రాంతాలలో చారిత్రకంగా సర్ఫ్ ఎ ఖాస్, జాగీర్, వక్ఫ్, గ్రామ కంఠం, ఊరుమ్మడి వంటి అనేక భూముల యాజమాన్యానికి, బదిలీలకు సంబంధించి వివాదంలో ఉన్నాయి. అటువంటి భూములలో గత ఏడెనిమిది దశాబ్దాలలో అధికార, రాజకీయ వర్గాల ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహంతో వేలాది ఎకరాల దురాక్రమణ జరిగింది గనుక, లెక్కలేనన్ని అక్రమ లేఔట్లు, అక్రమ నిర్మాణాలు జరిగాయి గనుక తప్పనిసరిగా ఆ దురాక్రమణలను అడ్డుకోవడానికి, వీలైనంతవరకు చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు జరగవలసిందే. అదే సమయంలో ఉపాధి కోసం నగరానికి చేరి ఏ రాజకీయ నాయకుల, అధికారుల ప్రత్యక్ష, పరోక్ష ప్రోద్బలంతో సెంటో గుంటో భూమి సంపాదించి, అది ఆక్రమణా కాదా అనే ప్రస్తావన లేకుండా తరతరాలుగా జీవిస్తున్నవారు ఉన్నారు.

విపరీతంగా పెరిగిపోయిన రియల్ ఎస్టేట్, బిల్డర్ వ్యాపారంలో వివాదాస్పద భూములలో వెంచర్లు, అపార్ట్ మెంట్లు నిర్మించి, అధికారుల లంచగొండితనం వల్ల అనుమతులు కూడా సంపాదించి, అవి పేద, మధ్యతరగతి ప్రజలకు అమ్ముకొని అదృశ్యమైపోయిన వ్యాపారులూ ఉన్నారు. ఇంత సంక్లిష్టమైన చిత్రంలో, నిజమైన అక్రమ ఆక్రమణలు ఏవో గుర్తించి వాటిని తొలగించగల హైడ్రా వంటి సంస్థ చాలా అవసరమే. హైదారాబాద్ భూ ఆస్తుల, నిర్మాణాల క్రమబద్ధత కోసం ప్రయత్నించడం, అక్రమ ఆక్రమణలను, నిర్మాణాలను తొలగించడం చాలా అవసరమే. కాని ఆ అవసరమైన పని కూడా చట్టం ప్రకారం, ఆమోదయోగ్యమైన పద్ధతి ప్రకారం జరగవలసిందే తప్ప నిరంకుశంగా కాదు.

కాని తన రెండు సంవత్సరాల జీవితంలో హైడ్రా ప్రవర్తిస్తూ వచ్చిన పద్ధతి, హైడ్రా అధికారుల నిరంకుశత్వం, బాధితుల పట్ల దురుసుతనం, ఎటువంటి నోటీసులు, ముందస్తు హెచ్చరికలు లేకుండా ఏ తెల్లవారు జామునో లెక్కలేనన్ని బుల్డోజర్లతో ఇళ్ల మీద పడి, బాధితుల గోడు పట్టించుకోకుండా బీభత్సం సృష్టించడం, ఆ బీభత్సానికి ఎటువంటి చట్టపరమైన ఆమోదం లేకపోవడం వంటి అనేక అపసవ్యతలు హైడ్రా పని తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక అక్రమాన్ని సరిదిద్దడానికి ఏర్పడిన సంస్థ తానే అక్రమాలకు నిలయంగా మారుతున్నది.  అందుకే సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో “అక్రమ నిర్మాణాలను” కూల్చివేసిన వేరువేరు కేసులను విచారిస్తూ ఒకవైపు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి శ్రవణ్ కుమార్, మరొకవైపు జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి హైడ్రా మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

“న్యాయస్థానాల వ్యాఖ్యలను బట్టి తేలుతున్నదేమంటే, హైడ్రా చట్టబద్ధమైన పద్ధతులు పాటించడం లేదు. సహజ న్యాయసూత్రాలను గౌరవించడం లేదు. విచ్చలవిడిగా చర్యలు చేపడుతున్నా ఆ చర్యలను నిర్దేశించే ఎస్ఓపి లేవు, అసలు ఈ సంస్థ జిహెచ్ఎంసి చట్టం కింద పని చేస్తున్నదా, మునిసిపాలిటీ చట్టం కింద పని చేస్తున్నదా, ఇటువంటి కూల్చివేతకు ఈ సంస్థకు అధికారం ఉన్నదా అనే ప్రశ్నలకు జవాబులు లేవు.”

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలో తన స్థలంలో ప్రవేశించి, దాని చుట్టూ కంచె పాతి, అది ప్రభుత్వ భూమి అని హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసిందని, తనకు ముందుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, ఈ చర్య చేపట్టడానికి హైడ్రాకు చట్టపరమైన అధికారం లేదని జితేంద్ర అనే పిటిషనర్ వేసిన రిట్ దరఖాస్తు మీద మాట్లాడుతూ, “హైడ్రా న్యాయస్థానాల కన్నా పైన ఉన్నానని అనుకుంటున్నదా, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నదా” అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ భూమి న్యాయస్థానం ముందు వివాదంలో ఉన్నదని, యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశాలున్నాయని, అటువంటిచోట హైడ్రా ఏకపక్షంగా జొరబడడాన్ని న్యాయస్థానం ఖండించింది. అలా జొరబడి భూమిని ఆక్రమించి కంచె నాటడానికి హైడ్రాకు అనుమతి ఎవరు ఇచ్చారో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు.

“జొరబడానికి అనుమతి రెవెన్యూ శాఖ ఇచ్చిందా?  మునిసిపాల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిందా?” అని ప్రశ్నించారు. వివాదాస్పద భూఖండాలను స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తి మరీ ఎక్కువయిందని, నిజానికి హైడ్రా ప్రధానమైన పని జలాశయాలను రక్షించడం, ఉత్పాతాలకు స్పందించడం అని న్యాయమూర్తి అన్నారు. “చెరువులనూ, కుంటలనూ రక్షించడానికి ఇటువంటి త్వరిత చర్యలు తీసుకోవడం లేదే” అని న్యాయమూర్తి అన్నారు. వివాదాస్పద భూములలో జోక్యం చేసుకోవడంలో హైడ్రాకు ఏవైనా “స్వార్థ ప్రయోజనాలు” ఉన్నాయా అని కూడా ప్రశ్నించారు. అంతకు రెండు రోజుల ముందు, శనివారం నాడు శేరి లింగంపల్లి సమీపంలో ఖానామెట్ లో 1.26 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని కంచెలు పాతిన కేసులో కూడా జస్టిస్ శ్రవణ్ కుమార్ హైడ్రా పని తీరును తప్పు పట్టారు.

అదే సమయంలో ఐలాపూర్ గ్రామంలో తన స్థలంలోకి శనివారం ఉదయం 4.30కు జొరబడి తన పూర్వీకుల రెండంతస్తుల నివాస గృహాన్ని, వాటర్ టాంక్ ను, ప్రహరీ గోడలను, పశువుల శాలలను కూల్చివేశారని, అక్కడి సిసిటివి కెమెరాలను, ఇతర పరికరాలను తీసుకుపోయారని 98 సంవత్సరాల వ్యవసాయదారు ఎం ఎ షరీఫ్ వేసిన రిట్ పిటిషన్ మీద వ్యాఖ్యానిస్తూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, హైడ్రా నగరంలోనూ, మునిసిపల్ ప్రాంతంలోనూ ఎటువంటి కూల్చివేతలను చేపట్టవద్దని ఆదేశించారు. నదులు, వాగులు, కాలువలు, రహదారులు దురాక్రమణలకు గురై ఉంటే వాటిని తొలగించడం మినహా ఇతర కూల్చివేతలు చేయగూడదని ఆదేశించారు.

గతంలో ఎన్నోసార్లు ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకపోవడం, ఇప్పటికీ కూల్చివేత సందర్భలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) తయారు చేసుకోకపోవడం న్యాయమూర్తి తప్పు పట్టారు. ఇటువంటి “వందలాది కేసులు” తన ముందుకు వస్తున్నాయని న్యాయమూర్తి అన్నారు. నోటీసు లేకుండా కూల్చివేతలు, సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి చర్యలు ఎంత సదుద్దేశాలతో జరిగినా చట్టం నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే జరగాలని న్యాయమూర్తి అన్నారు. హైడ్రా ఏడాదికి పైగా పని చేస్తున్నప్పటికీ, దానికి అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టత లేకపోవడం, దాని పని తీరును నిర్దేశించే ఎస్ఓపి సూత్రాలేమీ లేకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. ఎస్ఓపి తయారు చేసుకునేవరకూ కూల్చివేతలు జరగగూడదని ఆదేశించారు. “ఆ స్థలంలో హైడ్రా అధికారులు మోహరించిన తీరు, పరిస్థితిని పెంచి చూపిన తీరు… ఒక యుద్ధ పరిస్థితికి సమానంగా ఉన్నాయి. అటువంటిది జరగడానికి వీలులేదు” అన్నారు.

న్యాయస్థానాల వ్యాఖ్యలను బట్టి తేలుతున్నదేమంటే, హైడ్రా చట్టబద్ధమైన పద్ధతులు పాటించడం లేదు. సహజ న్యాయసూత్రాలను గౌరవించడం లేదు. విచ్చలవిడిగా చర్యలు చేపడుతున్నా ఆ చర్యలను నిర్దేశించే ఎస్ఓపి లేవు, అసలు ఈ సంస్థ జిహెచ్ఎంసి చట్టం కింద పని చేస్తున్నదా, మునిసిపాలిటీ చట్టం కింద పని చేస్తున్నదా,  ఇటువంటి కూల్చివేతకు ఈ సంస్థకు అధికారం ఉన్నదా అనే ప్రశ్నలకు జవాబులు లేవు. సహజంగానే ఎటువంటి పద్ధతీ లేని నిరంకుశ కూల్చివేతల బుల్డోజర్ రాజ్యంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నోరులేనివారిని మొత్తడం, పెద్దల అక్రమాలను చూసీ చూడనట్టు పోవడం వంటి పనులు జరిగిపోతాయి. అక్రమ ఆక్రమణలలో, నిర్మాణాలలో సంపన్నుల వాటా ఎక్కువ అయినప్పటికీ, వారి మీద చర్యలు ఆ నిష్పత్తిలో ఉండవు. ఎవరో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ వ్యాపారి మాటలు నమ్మి, ఇప్పటికే ఒకసారి మోసపోయిన దిగువ మధ్యతరగతి, పేద వర్గాల నివాస స్థలాలను “అక్రమ ఆక్రమణలు”గా చూపి వారి మీద విధ్వంసక దాడి జరుగుతుంటాయి.

అసలు ఇటివంటి అక్రమ నిర్మాణాలలో చాలా భాగం మునిసిపల్, ప్రభుత్వ అధికారుల అనుమతులతోనే, కాగితాల మీద అంతా సక్రమంగా ఉన్నట్టు కనిపిస్తూనే జరిగాయి, ఎలక్ట్రిసిటీ, వాటర్, సూవరేజి, రోడ్లు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలూ ఆ నిర్మాణాలను గుర్తించాయి. అంటే అసలు చర్యలంటూ తీసుకుంటే ఆ అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారుల మీద, ఆ వెంచర్లు వేసిన, ఆ భవనాలు కట్టి అమ్ముకుని పోయిన రియల్ ఎస్టేట్, బిల్డర్ మాఫియా మీద మొట్టమొదటి చర్యలు జరగాలి. కాని అమాయకంగా ఇళ్లు కొనుక్కున్న మధ్యతరగతి గృహస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. అంతకన్నా పెద్ద అక్రమాలే చేసి భవనాలు, ఫామ్ హౌజులు కట్టుకున్న రాజకీయ నాయకుల మీద, బడా సంపన్నుల మీద ఏవో చూపుకోవడానికి ఒకటి రెండు చర్యలు చేశారు గాని, ప్రతి అక్రమ ఆక్రమణనూ పట్టుకుంటున్న దాఖలాలు లేవు.

ఇటువంటి వివాదాలు తమ ముందుకు వచ్చినప్పుడల్లా, హైడ్రా చట్టానికి లోబడి పని చేయలేదని, తానే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని న్యాయస్థానాలు ఎన్నిసార్లు అభిశంసించినా హైడ్రా అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. పైగా న్యాయస్థానం జోక్యానికి అవకాశం లేకుండా విధ్వంసక కార్యకలాపాలను శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అర్ధరాత్రో తెల్లవారు జామునో చేపడుతున్నది. చట్టాన్ని పాటించడం లేదని విమర్శ వస్తున్నది గనుక ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ అనే చట్టపరమైన మాటలు వల్లిస్తున్నది. ఆ ప్రమాణాలను అన్ని సందర్భాలలోనూ వాడుతున్న దాఖలాలు లేవు. అర్ధబలం, అంగబలం, రాజకీయ మద్దతు ఉన్నవారి విషయంలో ఒకలా, అవి లేని వారి విషయంలో మరొకలా ప్రవర్తిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *