– వారు అమెరికా ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు
– తన అత్తామామలు కూడా ఆకోవలోని వారే
– ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్, ఏప్రిల్ 15: అమెరికా ఆర్థికవ్యవస్థలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అదే సమయంలో ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌పై కఠిన నియంత్రణనూ సమర్థించారు. అమెరికా పౌరసత్వం పొందడం అంటే ఈ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడమేనని వాన్స్ స్పష్టం చేశారు. జార్జియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ హెచ్-1బీ వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. తాను భారత్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాను.. వారు గొప్ప వ్యక్తులు.. యూఎస్‌కు వారు ఎంతో సేవ చేశారు.. భారత్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొనిల్ణ ఈ దేశ పౌరుడిగా మారిన తన మామగారు అమెరికా ప్రయోజనాల కోసమే పాటుపడ్డారు అని ప్రశంసలు కురిపించారు. అమెరికాను సుసంపన్నం చేయడంలో, ఈ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో వారు ఒక నిదర్శనంగా నిలిచారన్నారు. హెచ్-1బీ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారు గ్రీన్ కార్డ్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందంటూ భారత సంతతి వ్యక్తి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. ఇరాన్‌తో చర్చల అంశంపై జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న అపనమ్మకం రాత్రికి రాత్రి పోయేది కాదన్నారు. ఇరాన్ ప్రతినిధులు ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈనెల 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




