నిర్లక్ష్యం.. పసికందు భవిష్యత్తును అంధకారం

– శిశువు ఎడమ చేయి తొలగింపు
– కలెక్టర్‌కు మొరపెట్టుకున్న తల్లిదండ్రులు
– ఖమ్మం ప్రభుత్వ ద‌వాఖాన‌లో హృద‌య‌విదార‌క‌ ఘ‌ట‌న‌

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 1 :  నెలలు తక్కువగా పుట్టాడని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ద‌వాఖానకు వొస్తే.. అక్కడ సిబ్బంది చూపిన తీవ్ర నిర్లక్ష్యం ఒక పసికందును జీవితాంతం దివ్యాంగుడిగా మార్చింది. చేతికి కాన్యులా అమర్చిన చోట వాపు వస్తోందని, ఇన్ఫెక్షన్ సోకుతోందని మొత్తుకున్నా వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో, చివరికి ఆ పసిగుడ్డు ఎడమ చేయిని మోచేతి వరకు తొలగించాల్సి వచ్చిన అత్యంత హృదయవిదారక సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి రేణుక, సత్యకాంత్ దంపతులు నిరు పేద కుటుంబం. ఏడు నెలల గర్భిణి అయిన రేణుక.. నెలలు నిండకమునుపే గత మార్చి 3న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు (అబ్బాయిలు)కు జన్మనిచ్చింది. ఇందులో ఓ పిల్లాడు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉండగా, మరో బాబు కిలో 200 గ్రాముల బరువుతో జన్మించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో… తక్కువ బరువుతో పుట్టిన శిశువు మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేర్చారు. ఓ పిల్లాడితో రేణుక తాను ప్రసవించిన ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉండిపోగా.. రేణుక బంధువు చిర్రా విజయకుమారి చిన్నారిని చూసుకున్నారు. అక్క‌డ పసి కందును ఇంక్యుబేటర్లో ఉంచిన వైద్య సిబ్బంది  ప‌లుమార్లు ర‌క్తం ఎక్కించారు. అయితే 18 రోజుల త‌ర్వాత‌ పిల్లాడి ఎడమ చేతికి కాన్యులా పెట్టిన ప్రాంతంలో వాపు వ‌చ్చింది. దీనిపై చిన్నారి కుటుంబ సభ్యులు పలుమార్లు వైద్య సిబ్బంది కి చెప్పిన నిర్లక్ష్య సమాధానాలిస్తూ రోజులు గడిపారు. హఠాత్తుగా ఓ రోజు హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు. ఎడమ చేయి ఇన్ఫెక్షన్ వచ్చిందని తొలగించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు బోరుమ‌న్నారు. ఓ చెయ్యి తొలగించిన త‌ర్వాత స్వస్థలానికి చేరుకున్నారు. ఈ కేసును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించడం, టీఆర్ఎస్ నేత కవిత విమర్శలు, ముఖ్యమంత్రి కార్యాలయం విచారణ కు ఆదేశిండంతో సోమవారం కవల శిశువుల కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. డిఎంహెచ్ ఓ ద్వారా విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *