రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వం

– అందుకే సీఎం రేవంత్ పర్యటనకు అనుమతి నిరాకరణ
– విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ

న్యూదిల్లీ, ఆగస్టు 21 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూదిల్లీలో వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు, ఇతర ప్రముఖుల పర్యటనలను.. రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని వివరించారు. ప్రతిపాదిత కార్యక్రమం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటనకు క్లియరెన్స్ నిరాకరించామన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం న్యూదిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అర్థరాత్రి తర్వాత పది రోజుల విదేశీ పర్యటన కోసం లండన్‌కు బయలుదేరి వెళ్లారు. ముందు అనుకున్న ప్రకారం ఈనెల 30వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఈ రెండు దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్య, క్రీడల అభివృద్ధిపై చర్చించనుంది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సీఎం బృందం సందర్శించనుంది. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌లో పాల్గొననుంది. అనంతరం యూఎస్‌కు సీఎం బృందం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అయితే యూఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *