రియల్ ఎస్టేట్‌పై గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు

– రెండున్నరేళ్లలో దాదాపు 40 శాతం ‘రియల్’ వృద్ది
– త్వరలో మూసీ సుందరీకరణకు టెండర్లు
– రియల్ ఎస్టేట్‌తోపాటు పేదల ఇళ్ల నిర్మాణానికీ ప్రాధాన్యత
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారని, దీనిలో ఏమాత్రం నిజం లేదని రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ప్ శాఖ మంత్రిగా స్పష్టమైన ఆధారాలు, వివరాలు ఉన్నాయని, అందువల్ల అలాంటి ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. నగరంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండున్నరేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో సుమారు 15 నుంచి 20 శాతం రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగిందని, 40 శాతం వరకు ఫ్లాట్ల విక్రయాలు వృద్దిచెందాయని చెప్పారు. గతన పదేళ్లతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలో రెసిడెన్షియల్ మార్కెట్ విశేషంగా పెరిగిందని, దీనికి సంబంధించి తమ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పెరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్యే నిదర్శనమని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చొరవ కారణంగానే హైదరాబాద్ ఒక రోల్ మోడల్‌గా రూపొందిందని, వారి దూరదృష్టి వల్లే ఓఆరఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటి సెక్టార్ తదితరాలు 360 డిగ్రీల కోణంలో అభివృద్ది చెందాయని వివరించారు. అందువల్లే హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనేగాక ప్రపంచంలోనే అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ వెళ్లినపుడు అక్కడ కూడా అధికశాతం పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారని చెప్పారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు గమ్యస్ధానం అవుతుందన్నారు. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ప్రణాళికాబద్దంగా హైదరాబాద్ నగరాభివృద్దికి చర్యలు చేపట్టారు.. రూ.7వేల కోట్లతో చేపడుతున్న మూసీ ప్రాజెక్టు సుందరీకరణ పట్టాలెక్కనుంది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. 28 కి.మీ తొలి విడత అభివృద్దికి వారం పది రోజుల్లో టెండర్లు పిలవబోతున్నామని చెప్పారు. అలాగే పాత బస్తీ తదితరాలను కలుపుతూ రెండో విడతగా 76 కి.మీ మేర రూ.24వేల కోట్ల ఖర్చుతో మెట్రో విస్తరణ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఇవేగాక త్రిబుల్ ఆర్ నుంచి ఓఆర్ఆర్ కలుపుతూ రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దమవుతున్నాయని తెలిపారు. ప్రంచంలోనే సుందర నగరమైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పక్షాన కూడా మరింత అభివృద్ది చెందడానికి రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధుల సహకారం అవసరమని, ప్రజలకు నమ్మకంగా, సకాలంలో ఫ్లాట్లను అందించి వారి అభిమానాన్ని చూరగొనాలని మంత్రి హితవు పలికారు. రాష్ట్రంలో భూముల భద్రత, భరోసా కల్పించేందుకు భూభారతి చట్టాన్ని తెచ్చామని, వీటిలో కొన్ని చిన్న చిన్న సమస్యలను సాఫ్ట్‌వేర్‌పరంగా 15-20 రోజుల్లో సరిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కేవలం రియల్ ఎస్టేట్ రంగం కోసమే గాక పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు నిర్ణయించామని, దీని తర్వాత దఫదఫాలుగా ఇళ్ల మంజూరు ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి 2-3 లక్షల చదరపు అడుగుల స్ధల సేకరణకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధుల కోరిక మేరకు ఫాస్ట్ ట్రాక్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *