– సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ప్రముఖుల సంతాపం
చెన్నై, జూన్ 10 : దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీ రాజా (85) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2025 మార్చిలో కుమారుడు మనోజ్ భారతీ రాజా 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. పుత్రశోకం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన ఆయన ఆరోగ్యం మరింత బలహీనపడింది. గత ఏడాది డిసెంబర్‌లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బసం కారణంగా భారతీరాజాను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. చికిత్స పొందినప్పటికీ వయసు పైబడటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తరచూ ఆందోళనకరంగా మారింది. 1977లో విడుదలైన 16 వయాతినిలే (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. నాలుగు దశాబ్దాలపాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాక నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన తుడరుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన చివరగా నటించిన పులవర్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. భారతీరాజా సేవలను గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ సంతాపం
నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారని గుర్తుచేసుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. భారతీరాజా మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఎఫ్‌డీసీ ఎండీ ముకుందరెడ్డి సంతాపం
భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణ భారత సినిమాకు సరికొత్త నడకను, నవ్యతను పరిచయం చేసిన లెజెండరీ దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా హఠాన్మరణం పట్ల రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఎండీ ముకుందరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినిమాలను నాలుగు గోడల స్టూడియోల నుండి పల్లెటూరి పచ్చని పొలాల్లోకి, సహజ సిద్ధమైన లోకేషన్లలోకి తీసుకెళ్లి, రూరల్ సినిమాకు సరికొత్త నిర్వచనం చెప్పిన మహోన్నత దర్శకుడు ఆయన అని కొనియాడారు. తమిళ, తెలుగు చలనచిత్ర రంగాలలో ఎందరో నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసి వారిని అగ్ర తారలుగా తీర్చిదిద్దిన ఘనత భారతీరాజాకే దక్కుతుందన్నారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భగవంతుడు వారి ఆత్మకు సద్గతి ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలియ్పుశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





