‘పెసా’ చట్టం ఆదివాసీల స్వాభిమానానికి ప్రతీక

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభల సాధికారత, స్థానిక స్వపరిపాలన బలోపేతం, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ‘పెసా’ చట్టం అత్యంత కీలకమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ చట్టంపై అవగాహన లోపాలు ఇంకా కనిపిస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ‘పెసా’ కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సమగ్ర శిక్షణ అవసరమనే ఉద్దేశంతో వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్‌డీ)లో ‘షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ సంస్థల బలోపేతంలో పెసా చట్టం పాత్ర’ అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, పీసా మొబిలైజర్లు, కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావుల బృంద సభ్యులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పెసా ఒక చట్టం మాత్రమే కాదని, అది ఆదివాసీల ఆత్మగౌరవానికి, స్వయం నిర్ణయాధికారానికి, సహజ వనరులపై హక్కులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ అని అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని భూములు, అడవులు, జల వనరులు, ఖనిజ సంపదలపై గ్రామ సభల నిర్ణయాధికారాన్ని పెసా చట్టం కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సహజ వనరులు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పెద్దపెద్ద సంస్థలు ప్రజలను నిరాశ్రయులను చేసే పరిస్థితులను పీసా చట్టం అంగీకరించదు.. కానీ ఆ హక్కుల గురించి ఎంతమందికి అవగాహన ఉంది అనేది ప్రశ్న.. అధికారులు పనిచేసే అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి.. చట్ట స్ఫూర్తిని అర్థం చేసుకుని అమలు చేసినప్పుడే ఆదివాసీలకు న్యాయం జరుగుతుంది’ అని మంత్రి అన్నారు. తాను ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తినని, ఆదివాసీ ప్రాంతాల్లో పెరిగి అక్కడి సమస్యలను దగ్గరగా చూసిన వ్యక్తిగా గిరిజన హక్కుల పరిరక్షణ తన ప్రత్యేక బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు దక్కడం తనకు గర్వకారణమని, ఆ అవకాశాన్ని సమాజానికి మేలు చేసే దిశగా వినియోగించుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తెలిపారు. సహజ వనరులు క్షీణిస్తున్నాయని, గుట్టలు కరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు, గ్రామసభలను బలోపేతం చేయడం అత్యవసరమని చెప్పారు. వర్క్‌షాప్‌లో పాల్గొంటున్న ప్రతినిధులు తమ అనుభవాలు, సూచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవాలని మంత్రి కోరారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సర్పంచుల కోసం రూపొందించిన ‘సర్పంచ్ సంవాద’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రస్తావించిన మంత్రి దేశవ్యాప్తంగా అవార్డులు అందుకున్న ఈ యాప్ ద్వారా తెలంగాణలోని 4,500 మంది సర్పంచులు పరస్పరం ఉత్తమ అనుభవాలను పంచుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి ఒకే వేదికపై చర్చించే అవకాశం లభిస్తుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామీణ పాలనను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘పీసా’ అమలు పుస్తకాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, గ్రామ సభల నిర్ణయాలకు గౌరవం కల్పిస్తూ ఆదివాసీల స్వపరిపాలన స్ఫూర్తిని కార్యరూపంలోకి తీసుకురావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి : మంత్రి సీతక్క

మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు అచ్చ సంధ్యారెడ్డి నిర్వహిస్తున్న మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ(స్వచ్ఛంద సంస్థ) ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మూడు వేల మంది మహిళలకు గాంధీ భవన్‌లో కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 15 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటిన వారు కూడా మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరవచ్చునని, శిక్షణ పూర్తయిన వారికి కుట్టు మిషన్లు అందిస్తామని తెలిపారు. మీరు షాపు ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందిస్తాం.. మరిన్ని మిషన్లు కొనుగోలు చేసి వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటే అదనపు రుణాలతోపాటు శిక్షణ కూడా అందిస్తాం అని చెప్పారు. మదర్ ఫౌండేషన్ గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తోందని కొనియాడారు. నిన్న 553 బస్సులను మహిళా సంఘాలకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించాం.. వాటిద్వారా వారు నెలకు సగటున రూ.70 వేల ఆదాయం పొందుతున్నారని, పంటల సీజన్‌లో మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కార్యక్రమాలు చేపడుతుండగా గత ఏడాది ఆ సంఘాలు రూ.159 కోట్ల ఆదాయం ఆర్జించాయని వివరించారు. 60 ఏళ్లు దాటిన వారికి కూడా విద్య అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. స్నేహ గ్రూపులలో ఇప్పటికే లక్షమంది మహిళలను చేర్చి సైకిల్ తొక్కడం నేర్పించాం.. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా అందించబోతున్నాం.. శిల్పారామం వద్ద 106 షాపులు మహిళల ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి అని వివరించారు. కాగా, మహిళలకు ఏదైనా మేలు చేస్తే కొందరు విమర్శిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా విమర్శిస్తున్నారు.. వారిని కించపరిస్తే సహించం.. తగు సమాధానం చెబుతామని మంత్రిహెచ్చరించారు.

మీనాక్షి గాంధేయవాది

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ గాంధీయవాది అని, తమ అధిష్ఠానం రాజ్యసభ సీటు ఇస్తే బీజేపీ కుట్రలు చేసి రాజ్యసభకు వేసిన నామినేషన్ తిరస్కరించేలా కుట్ర పన్నిందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహిళల ద్రోహి బీజేపీ.. మహిళను రాజ్యసభకు పోకుండా అడ్డుకుంటున్నదని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ విభజన విద్వేషాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, మహిళలని అణగదొక్కడం, అడ్డుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందతని దుయ్యబట్టారు. మీనాక్షి నామినేషన్ రద్దు చేయించి విర్రవీగుతున్నాడంటూ ఏం చేసినా నెహ్రు గొప్పతనాన్ని బ్రేక్ చేయలేవు అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *