డిజిటల్‌ వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ

– కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం
– సాగు వ్యయం, రసాయనాల వినియోగం తగ్గించడమే లక్ష్యం
– జర్మనీ పరిశోధన సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోడం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే తమ సంకల్పమని వివరించారు. సాగులో నూతన ఆలోచనలతో ముందుకొచ్చే ఆవిష్కర్తలను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామన్నారు. కృత్రిమ మేథ(ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) వంటి కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనుసంధానం చేయాలనే అంశంపై సచివాలయంలో జర్మనీకి చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ఫ్రాన్‌హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధుల బృందంతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది.. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం మందికి జీవనోపాధి కల్పిస్తోంది.. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరుగుదలకు తన చేయూతనందిస్తోంది.. మరోవైపు కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌కు రాష్ట్రం గ్లోబల్‌ హబ్‌గా మారింది.. ఇలాంటి తరుణంలో డిజిటల్‌ వ్యవసాయంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని సంకల్పించాం’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రోజురోజుకూ వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, పైగా సాగులో పురుగు మందుల వినియోగం పెరిగి పర్యావరణానికి ఎంతో హాని జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడి వ్యయం, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలంటే కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను వ్యవసాయానికి అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాధునిక సెన్సార్ల ద్వారా నేల స్వభావాన్ని రైతులు ముందే తెలుసుకోవచ్చని, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించొచ్చునని, ఫలితంగా రసాయనాల కొనుగోలు ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతాయని, పర్యావరణానికీ మేలు జరుగుతుందని తెలిపారు. సుస్థిరమైన, క్లైమేట్‌-రెసిలియెంట్‌ వ్యవసాయ పద్ధతులకు మార్గం సుగమమవుతుందన్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా వేములవాడకు సమీపంలోని మూడు గ్రామాల్లో ఫ్రాన్‌హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న యాక్సిలరేటింగ్‌ క్లైమేట్‌-రెసిలియెంట్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ తెలంగాణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చొరవ చూపాలని సంస్థ ప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి, సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, జర్మనీ రాయబార కార్యాలయం(న్యూదిల్లీ) ఫుడ్‌, అగ్రికల్చర్‌ డివిజన్‌ హెడ్‌ వోల్కర్‌ క్లైమా, ఫ్రాన్‌ హోఫర్‌ హెచ్‌హెచ్‌ఐ ప్రతినిధులు డాక్టర్‌ సెబాస్టియన్‌ బోస్సే, డాక్టరు రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page