– ఆ వర్గం సమస్యలు పరిష్కరించండి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: మహర్షి వాల్మీకి వారసత్వ వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సత్యం, ధర్మం, న్యాయం, నైతికత మార్గాలను చూపిన మహర్షి వాల్మీకి బోధనలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. వాల్మీకి సమాజం వెనుకబడిన తరగతులలో ఉందని, అయితే వారి అభ్యున్నతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఇటీవల గద్వాల ప్రాంతంలో బోయ వాల్మీకి సోదరులు తనను కలిసి సమస్యలను వివరించారని, వారికి ఎమ్మార్వో ఆఫీసుల్లో కనీసం కుల ధ్రువీకరణ వపత్రాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకి బోయల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే బీసీలకు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లో నడుస్తున్నాయని, దాదాపు 6.70 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుతున్నా వారికి సరైన భోజనం లేదు.. సురక్షితమైన భవనాలు లేవు.. ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు భవనాలకు తాళాలు వేస్తున్నారు.. ఫలితంగా విద్యార్థులు నాసిరకం భోజనం, పాక్షిక ఆహారం లేదా ఆహార లోపంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని వివరించారు. శిథిలావస్థకు చేరిన గురుకులాల భవనాలకు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల విద్యార్థుల కోసం గురుకులాల్లో అన్ని వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





