ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందే

– ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం
– విద్యార్థులపై కేసులను ఎత్తివేయాల్సిందే
– కేంద్ర‌ మంత్రులకు తేల్చి చెప్పిన సిజెపి ప్రతినిధులు

న్యూదిల్లీ,జూలై24 : నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు కేంద్రం బాధ్యత తీసుకోవాలంటూ పట్టుబడుతున్న కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్‌ ‌సింగ్‌లతో శుక్రవారం సమావేశమయ్యారు. నీట్‌ ‌సహా విద్యా వ్యవస్థలో కీలక అంశాలపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు ఈ చర్చలు జరిగాయి. తమ డిమాండ్లను సీజేపీ లిఖితపూర్వకంగా ప్రభుత్వం ముందుంచింది. నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పేపర్‌ ‌లీక్‌ ‌నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించాలని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్ర మంత్రులు స్పందింస్తూ తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, రేపు మరోసారి భేటీ అయ్యేందుకు ఇరు వర్గాలు నిర్ణయించాయి. కేంద్రం మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టామని సీజేపీ ప్రతినిధి సౌరభ్‌ ‌దాస్‌ ‌తెలిపారు. మూడింట్లో రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని అన్నారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాకు సంబంధించి రేపటి వరకు కేంద్రం గడువు కోరిందని సౌరభ్‌ ‌దాస్‌ ‌చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌పై రేపు మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం కోరిందని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.దాదాపు 2గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ ‌హాజరుకాగా.. సీజేపీ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు సౌరవ్‌ ‌దాస్‌, అశుతోష్‌ ‌రాంకా వెళ్లారు. నీట్‌  ‌పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా తప్ప మరేదీ ఆమోదయోగ్యం కాదని సీజేపీ డిమాండ్‌ ‌చేసింది. అది నెరవేరకపోతే ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రధాన్‌ ‌వైదొలిగే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని పునరుద్ఘాటించింది.

పరీక్షలకు తాత్కాలిక సర్దుబాట్లు సరికాదు : సుప్రీం

సంచలనం సృష్టించిన పేపర్‌ ‌లీక్‌ ‌వ్యవహారం తర్వాత చేపట్టిన సంస్కరణల పురోగతిపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణలో తాత్కాలిక సర్దుబాట్లు కాకుండా, శాశ్వత వ్యవస్థాగత సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్‌ ‌దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీలను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంచేందుకు చేపట్టిన చర్యలపై 10 ప్రధాన రంగాల వారీగా వివరాలు సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. డిజిటల్‌ ‌మౌలిక వసతులు, భద్రతా ప్రమాణాలు, పరిశోధన, పారదర్శకత, పరిపాలన, మానవ వనరులు వంటి అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించింది. పరీక్ష జరగడానికి ముందు, పరీక్ష సమయంలో, పరీక్ష పూర్తయిన తర్వాత చేపట్టిన సంస్కరణలపై స్టేటస్‌ ‌రిపోర్ట్ అం‌దించాలని ఆదేశించింది. పరీక్షా పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళాన్ని  ఉపయోగించడంపై జస్టిస్‌ ‌పి.ఎస్‌. ‌నరసింహ వ్యాఖ్యానిస్తూ… ఇది ఒక తాత్కాలిక నివారణ చర్య మాత్రమే తప్ప, పరీక్షల భద్రతకు శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు. అలాగే, భవిష్యత్తులో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానం అమలు పురోగతి, అభ్యర్థుల సమాచారాన్ని కాపాడే డేటా రక్షణ చర్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. అభ్యర్థుల ధృవీకరణ కోసం ‘డిజీయాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. పరీక్షల పర్యవేక్షణకు సంబంధించి ప్రతిపాదించిన గవర్నింగ్‌ ‌బోర్డు, నిపుణుల కమిటీలు, స్టేక్‌హోల్డర్‌ ‌నామినేషన్ల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో నివేదికలో తెలపాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా, కోర్టు సూచించిన అన్ని అంశాలతో సమగ్రమైన తాజా అఫిడవిట్‌ను త్వరలోనే దాఖలు చేస్తామని హా ఇచ్చారు. దానికి ధర్మాసనం ఆమోదం తెలిపింది. అత్యంత కీలకమైన జాతీయ పరీక్షల్లో సంస్కరణల అమలును కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *