– కాక్రోచ్ పట్టు.. అదొక్కటి తప్ప అంటున్న కేంద్రం
– మూడవ విడత చర్చలకు సిద్దం
(ప్రజాతంత్ర న్యూస్ బ్యూరో, న్యూదిల్లీ)
ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటినీ ఒప్పుకున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు వెనక్కు తగ్గేదేలేదని బొద్దింకల పార్టీ పట్టుదలను ప్రదర్శించడంతో కేంద్ర మంత్రులతో శుక్రవారం జరిగిన చర్చల్లో ప్రతిష్టంబన ఏర్పడింది. కాక్రోచ్ ప్రతినిధులు కేంద్ర మంత్రి రాజీనామాపై ఏమాత్రం సడలకపోవడంతో చర్చలను కేంద్ర మంత్రులు శనివారానికి వాయిదా వేశారు. అయితే ఈ విషయంలో తాము కేంద్రానికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇస్తామని, కాని పక్షంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్ అల్టిమేటమ్ ఇచ్చింది. దీనిపై ఏం జరుగనుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. దేశవ్యాప్తంగా కల్లోలం లేపుతున్న నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, విద్యావ్యవస్థకు సంబంధించిన సంస్కరణలపై కాక్రోచ్ పార్టీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు నెలరోజులకు పైగా కొనసాగుతున్న వీరి ఆందోళన సోమవారం తీవ్ర రూపందాల్చింది. రక్తసిక్తంగా మారిన వీరి ఆందోళనపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ఫలితంగా కాక్రోచ్ ప్రతినిధులతో మూడు దఫాలుగా చర్చలు జరిపింది. శుక్రవారం నాటి చర్చలు ఒక కొలిక్కి వొస్తాయనుకున్నప్పటికీ చర్చల్లో ప్రతిష్టంబన ఏర్పడింది. కేంద్రం ముందు కాక్రోచ్ పార్టీ మూడు డిమాండ్లను లిఖిత పూర్వకంగా ఉంచింది. అందులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నది ప్రధానాంశం. 
కాగా, జంతర్‌మంతర్ దగ్గర నిరసన తెలిపిన వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవొద్దని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోరాదన్నది ఒకటికాగా, ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్ధుల కుటుంబ సభ్యులకు కోటి రూపాయలను అందించాలని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న తదితర డిమాండ్లపై కేంద్ర కొంతవరకు సానుకూలత ప్రదర్శించింది. అయితే వాటిపైనకూడా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. వీటితోపాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే కాక్రోచ్ పార్టీనుండి చర్చలకు వెళ్ళిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా పట్టుదల చూపించారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చలు జరిపిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ కాక్రోచ్ ప్రతినిధుల డిమాండ్‌లపై తమ ఉన్నత నాయకులతో చర్చిస్తామనడంతో, వారికి 24 గంటల సమయాన్నిస్తున్నట్లు కాక్రోచ్ ప్రతినిధులు ప్రకటించారు. కాగా ఈ ఆందోళనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ, ప్రధాన్ రాజీనామా చేస్తేనే కేంద్రంతో చర్చలుంటాయని ఖచ్చితంగా చెప్పారు. కాక్రోచ్‌పార్టీ కేంద్రం ముందుంచిన మూడు డిమాండ్లను కూడా నెరవేర్చాలన్నారు. పేపర్ లీకేజీలపై కేంద్రం కఠిన నిర్ణయం : ఇదిలాఉంటే పేపర్ లీకేజీల వ్యవహారాలకు సంబందించి ఇకముందు కేంద్రం కఠిన చర్యలు చేపడుతుందని ప్రధాని మోదీ తాజాగా ప్రకటించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ( ప్రివేన్షన్ ఆఫ్ అన్‌ఫేయిర్ మీన్స్) యాక్టు 2024ను ప్రభుత్వం మరింత పదును పెట్టనుంది. ఈ లీకేజీల వ్యవహారాన్ని మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధలను ఇందులో చేర్చనున్నారు. ఈ కోర్టులు మూడు నెలల్లో కేసులను పరిష్కరించి, శిక్షను ప్రకటిస్తాయని మోదీ ఒక వీడియో సందేశంలో చెప్పారు. కాగా లీకేజీ నేరం రుజవైతే 5 ఏళ్ళనుండి పదేళ్ళు జైలు శిక్ష, కనీసం కోటి రూపాయల జుర్మానా వేయాలని దీనిపై అత్యవసరంగా సమావేశమైన క్యాబినెట్ ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుపైన తీర్మానించినట్లు తెలుస్తున్నది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




