ధిక్కార కవి దేవులపల్లి సుదర్శన్

– బహు భాషల సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మేధావి
– అంపశయ్య నవీన్

కాళోజీ జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: దేవులపల్లి సుదర్శన్ రావు కవిత్వంలో ధిక్కార గొంతుక వినిపిస్తుందని ప్రముఖ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అన్నారు. దేవులపల్లి సుదర్శన్ రావు శత జయంతి ఉత్సవం సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ అధ్యక్షతన హనుమకొండలో శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అంపశయ్య నవీన్ మాట్లాడుతూ ఓరుగల్లు మిత్రమండలిలో సుదర్శన్ రావు తనదైన ఆలోచనల్లో స్వేచ్ఛ ప్రియత్వాన్ని సాహిత్యంలో ప్రదర్శించారని పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ తదితర భాషల్లో సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేసిన మేధావిగా సుదర్శన్ రావును గుర్తు చేసుకున్నారు. కాళోజి అవార్డు గ్రహీత వి.ఆర్.విద్యార్థి మాట్లాడుతూ సుదర్శన్ రావు రచయితగా ప్రజల వైపు నిలబడి తన గొంతుకను వినిపించారని గుర్తు చేసుకున్నారు.్ల ఆయన సాహిత్యం మీద ఓరుగల్లు మిత్రమండలి ఆధ్వర్యంలో త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాతతరం కవుల్లో నేటితరం యువతరానికి ఆయన రచనలు స్ఫూర్తిదాయకమైనవని చెప్పారు. ఆయన స్వతంత్రమైన ఆలోచనలు సామాజిక స్పృహ సాహిత్యంలో గుర్తించవచ్చన్నారు. సుదర్శన్ రావు సాహిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నేటి సాహితీ సంస్థలకు ఉందని సూచించారు. తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవులపల్లి సాహిత్యంలో ప్రకటించిన సాహిత్య విలువలు, సామాజిక ఆకాంక్షలు నేటికీ ఎంతో ప్రాసంగీకతను కలిగి ఉన్నాయన్నారు. సామాజిక బాధ్యతను కలిగి ఉండి సమాజ మార్పు కోసం సమాజంలోని చెడుపైన సుదర్శన్ రావు తన కలాని ఝళిపించారని చెప్పారు. సుదర్శన్ రావు కవిత్వంలో వ్యంగ్యాస్త్రాలు పాఠకులను అద్భుతంగా ఆలోచింపజేస్తాయని వివరించారు. మిత్ర మండలి సాహితీ సంస్థ ద్వారా సుదర్శన్ రావు తరం మహాకవుల గురించి సంభాషించే అవకాశం తనకు లభించిందని నెమరువేసుకున్నారు. సీనియర్ రచయిత, ఓరుగల్లు మిత్రమండలి సభ్యుడు గంట రామిరెడ్డి మాట్లాడుతూ దేవులపల్లి రచనలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. దేసురా రచనలు పునర్ముద్రించి సాహిత్యాన్ని ప్రజల్లోకి వెళ్లే విధంగా వారి కుటుంబ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఆకునూరి జగన్మోహన్‌రావు మాట్లాడుతూ తమ తరానికి సుదర్శన్ రావు దిక్సూచిగా నిలిచారన్నారు. ఆయన ఆలోచనలు నిరాడంబరత్వం అధ్యయనం తమను ఎంతగానో ఆకర్షించి చైతన్యపరిచాయని చెప్పారు. సమావేశానికి అధ్యక్షత వహించిన దేవులపల్లి అమర్ మాట్లాడుతూ తమ కుటుంబానికి బమ్మెర పోతన కుటుంబ వారసులతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పోతన సాహిత్యంలోని దిక్కార స్వరమే సుదర్శన్ రావు కవిత్వంలో కనిపిస్తోందని చెప్పారు. తిరగబడు కవుల్లో ఒకరిగా తన సాహిత్య సృజనను సమాజానికి అందించారని పేర్కొన్నారు. నేటి నవతరానికి సుదర్శన్ రావు సాహిత్యాన్ని అందించడానికి కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛ సాహితీ సంస్థ వ్యవస్థాపకుల్లో సుదర్శన్ రావు ఒకరిగా కృషి చేశారని వరవరరావు నివాళి వ్యాసం నుండి కవయిత్రి సహజ గుర్తు చేసుకున్నారు. వరవరరావు రచించిన ‘చలి నెగళ్ళు్ణ కవితా సంపుటికి ప్రచురణకు ప్రేరణ కల్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు దాసరి కృష్ణారెడ్డి, జగన్మోహన్ రావు, శేషగిరిరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ రామలక్ష్మి, సుదర్శన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *