- ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ
- డావోస్ పర్యటనతో హైదరాబాద్ కు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు
- రియల్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- మెట్రో విస్తరణకు రూట్ మ్యాప్
- నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంలో పేరొందిన నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఆయన వెల్లడించారు. ఆ మాటకొస్తే శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ఏర్పాటుతో పాటు మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ కు కృష్ణా, గోదావరి జలాలు తరలించింది కూడా కాంగ్రెస్ పాలనలోనే అన్నది విస్మరించొద్దని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్-2025 కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొచ్చాక ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు తరలిరావడం అభినందనీయమని కొనియాడారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్‌లో పాల్గొని రాష్ట్రానికి 1.78 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయూత అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్, బిల్డర్లు తమ తమ రంగాలలో సమస్యలు ఉత్పన్నమయినప్పుడు నేరుగా సంప్రదించవచ్చన్నారు. అందుకు 24 గంటలు తాను అందుబాటులో ఉంటానన్నారు. ఐటి, నిర్మాణ రంగం వారితో పాటు పరిశ్రమలకు వృత్తి నైపుణ్యం కలిగిన వారిని అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతే కాకుండా క్రీడాకారులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు.
విస్తరిస్తున్న మహానగరంలో పెరిగిపోతున్న జనాభాతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పురోగతి సాధించబోతుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వొస్తున్న హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం హైదరాబాద్ అభివృద్ధిలో భాగమేనన్నారు. సియోల్ నగరంలోని చియంగ్ గెచియాన్ తరహాలో మూసీ పునరుద్ధరణ ఉంటుందన్నారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజలు దాహార్తికి లోను కాకుండా ఉండేందుకు గాను గోదావరి జలాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అందులో భాగంగా కొత్త పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయన్నారు అదే విదంగా పెరుగుతున్న జనాభా కనుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గాను మెట్రోను విస్తరించేందుకు ఉపక్రమించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.





