- నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- దేవాదుల పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
Devadula Project : హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగునీరు, తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఐదు లక్షల ఏకారలకు సాగు నీరు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ పంప్ స్టేషన్ ను ఆయన గురువారం సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కె.నాగరాజు,యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని మూడు దశలలో పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు. తాజాగా ప్రారంభించిన పేజ్ 3 పంప్ హౌస్ తో రబీ సీజన్ లో పంటలను కాపాడడంతో పాటు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మార్గమం సుగమమైందన్నారు.
దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి చివరి అంచు వరకు సేద్యంలోకి తీసుకు రావాలి అన్నదే ప్రభుత్వ దృఢమైన సంకల్పమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రం నిధులు అందించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అనుమతులు సకాలంలో పొందలేకపోయారని ఆయన విరుచుకుపడ్డారు. దేవన్నపేట వద్ద ప్రారంభించిన దేవాదుల పేజ్ 3 పంప్ హౌస్ అద్భుతమైన డిజైన్ తోరూపొందించబడిందని ఆయన కొనియాడారు. 144.50 మీటర్ల లోతులో 25.50 మీటర్ల వెడల్పుతో రూపొందించిన ఈ పంప్ హౌజ్ లో మూడు 31 మేఘావాట్ల సింక్రోనస్ మోటార్లు అమర్చరన్నారు.
ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన ఈ పంప్ హౌజ్ తో 5,22,522 ఎకరాల ఆయాకట్టుకు నీరు అందుతుందన్నారు ఈ పంప్ హౌజ్ నుంచి వొచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేసి స్టేషన్ ఘన్ పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తరభాగాన ప్రధాన కాలువ ద్వారా, అదే విధంగా దక్షిణ భాగా కాలువ గుండా స్టేషన్ ఘనపూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ పరిధిలోని 1,58,948 ఎకరాలతో పాటు ధర్మసాగర్ తర్వాత బొమ్మకూర్,తపస్సపల్లి,గండి రామరం, అశ్వారావుపల్లి ల పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు
అదే సమయంలో ఇదే పంప్ హౌజ్ మీద త్రాగునీటి అవసరాలు కుడా ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు
వరంగల్, హనుమకొండ,కాజీపేట మూడు నగరాలతో పాటుగా జనగామ పట్టణానికి త్రాగు నీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు. మొత్తంగా వరంగల్, స్టేషన్ ఘనపూర్,జనగామ,పాలకుర్తి,భూపాలపల్లి నియోజకవర్గలకు ఇది ప్రయోజనకారిగా మారబోతుందన్నారు. సాగునీటి అంశంలో రైతాంగం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న కర్తవ్యమన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ హయాంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పేజ్ 1 పూర్తి చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన పనులు నిలిచిపోయాయన్నారు.