అమ్మ – నేను సూర్యుడి వెలుతురు రాగానే
కాలినడకన, పొయ్యి కట్టెలకై అడవికి పోయి
ఎండిన కపోండ్ర పబును ఈడ్చుకొచ్చే తరుణంలో
అరచేతికి గీసుకున్న రేగి కంప డబ్బాలోని
బుక్కెడు నీళ్లు తాపి అమ్మ రక్తమరకకు
సున్నము పెట్టింది.
అమ్మ కట్టెలను చెలుగుతుంటే నేను
దుసర తీగ కోసుకొచ్చి నేలపై పరిచి
ఒక కట్టె వెనుక ఒకటి పేరుస్తూ తీసుకెళ్లిన
సద్దికూడు యాపటలకు తిని
అమ్మ నేను పెద్ద, చిన్న కట్టెల మోపు గుంజీ
బీగ్గరగా కట్టి తువాలుతో సుట్ట సుట్టి నెత్తిన
పెట్టింది మోపు అమ్మ ముందు నేను వెనకాల
కట్టెల మోపులతో ఇంటికీ ప్రయాణం
అమ్మ గడి గడికి వస్తున్నవరంటూ పలుకరిస్తూ
వెళ్తున్న దారిలో మాయదారి ముళ్లు తుమ్మముళ్లు
అరిగిన చెప్పులోంచి అమ్మ కాలికి గుచ్చుకుని
రక్తం చిమ్మింది సున్నం పెట్టి బట్టకట్టిన ఆగలేదు
ఎలాగోలా అతి కష్టంపై ఇల్లు చేరుకుని
మాపటాలకు అమ్మ కిరోసిన్ తో కడిగి
జీడి పోసి దీపం బుడ్డి వెలిగించి కాపింది
అమ్మ రెండు మూడు రోజులు చుట్టు పక్కల
వారితో తుమ్మ ముళ్లును యాదికి చేసుకుంది.
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త, 9701209355