డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం

ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే య‌త్నం…
కేంద్రం కుట్ర‌ను సమర్థవంతంగా తిప్పికొడ‌తాం
ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి
22న జెఎసి సమావేశానికి రేవంత్‌కు డిఎంకె ఆహ్వానం
పార్టీ ఆదేశాలు తీసుకుని వొస్తానని వెల్లడించిన రేవంత్‌
తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ
భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానిస్తామన్న సిఎం

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ను తిప్పికొట్టే కార్యాచ‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అది నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న కాద‌ని ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే ప్ర‌య‌త్నమ‌ని సీఎం అన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు క‌లిగే న‌ష్టాలు.. చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించేందుకు చెన్నైలో ఈ నెల 22న జ‌రిగే సమావేశానికి హాజ‌రుకావాలంటూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేర‌కు త‌మిళ‌నాడు సీఎం రాసిన లేఖ‌ను ఆ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.ఎన్‌.నెహ్రూ ఆధ్వ‌ర్యంలోని డీఎంకే ప్ర‌తినిధి బృందం దిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి గురువారం అంద‌జేసింది.

2026 త‌ర్వాత చేప‌ట్టే జ‌న గ‌ణ‌న వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్ట‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లున్నా కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం అంత‌కుముందు గానే ఈ ప్ర‌క్రియ‌ను తెర‌పైకి తెచ్చింద‌ని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై త‌మ రాష్ట్రంలో ఇప్ప‌టికే అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశామ‌ని లేఖ‌లో వెల్ల‌డించారు. ఈ విష‌యంలో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల‌తో కూడిన ఐక్య కార్యాచ‌ర‌ణ క‌మిటీలో (జేఏపీ) చేరేందుకు అంగీకారం తెల‌పాల‌ని స్టాలిన్ లేఖ‌లో కోరారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు జేఏసీలోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఒక ప్ర‌తినిధిని నియ‌మించాల‌ని లేఖ‌లో సూచించారు. ముఖ్య‌మంత్రిని క‌లిసిన డీఎంకే ప్ర‌తినిధి బృందంలో ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏకేఎస్ విజ‌య‌న్‌, డీఎంకే పార్ల‌మెంట‌రీ పార్టీ నేత క‌నిమొళి, డీఎంకే ఎంపీలు ఏ.రాజా, ఎన్‌.ఆర్‌. ఇళంగో, క‌ళానిధి వీర‌స్వామి, అరుణ్ నెహ్రూ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *