‘‘హేలికా పూర్ణిమా-హోలీ’’

ఇంటికి ఓ పదిమంది చుట్టాలు వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయెప్పుడు చివరి చుట్టం ‘వెళ్ళొస్తాను’,అనగానే ఓ క్షణం అలా కళ్ళు చెమ్మగిల్లుతాయి.అలాగే సంవత్సర చక్రంలోని చివరి పండగ ‘హేలికా పూర్ణిమ’ అనగా…. హోలీ  మెల్లగా వెళ్లిపోతుంటే అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అనుకుంటూ కొత్త సంవత్సరం లోకి అడుగుపెడతాం. హోలీ  పండగ అసలు పేరు హేలికా పూర్ణిమ .సంస్కృతం లో హేలా అంటే విలాసం లేదా వినోదం అని అర్ధం. అలాంటి వినోదమే ప్రధానంగా గల పూర్ణిమ  కాబట్టి దీనికి హేలికా పూర్ణిమ అని పేరు పెట్టారు మన పూర్వికులు.కొన్నాళ్ల పాటు ఏ ఉత్సవం ఐనా,శుభకార్యమైన జరిగితే ఆ చివరిరోజున మంచి వినోద ప్రధానమైన కార్యక్రమం చేసుకోవడం అనేది మనకు ప్రాచీనులు పెట్టిన ఒక సాంప్రదాయ పద్దతి.
అందుకే పెళ్లి ముగిశాక బంధుమిత్రులు అందరూ తిరిగి వెళ్లిపోయే రోజున ‘‘బుజం బంతి’’ అనే పేరిట భోజనాలని ఏర్పాటు చేసుకొని ఆ భోజనాల వేళలో చిన్న,పెద్ద అంతా కలిసి అల్లరి చేస్తూ భోజనం చేసేవారు.భోజనం అయిన తర్వాత బావలు మరదళ్ల కొంగులకి చేతులు తుడవడం వంటి అల్లరి పనులు కూడా చేసేవారు.మళ్ళీ ఆ వినోదం అయిన తర్వాత ఎవరి పెద్దరికం వారిదే,ఎవరి గౌరవం వారిదే. ఇదే విధంగా సంవత్సరం చక్రం లోని పండుగలన్ని ముగిసాయి అనేందుకు గుర్తుగా ఈ హోలీ  నాడు కూడా రకరకాల రంగుల్ని జల్లుకోవడం,ఒకరిపై ఒకరు రంగునీళ్లు పిచికారి చేసుకోవడం చేస్తుంటారు.ఇలా చేయడంలో ఓ అర్ధం ఉంది. సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ నాడు పెద్ద పెద్ద మంటల్ని వేసేవారు ఎందుకంటే…రేపటినుండి ఇంతకంటే పెద్ద మంట అంటే వేసవి కాలం రాబోతుందని చెప్పడం. ఈ హోలీ  రోజున ఎలాగైతే రంగులు చల్లుకుంటామో అలాగే ప్రకృతిలో కూడా కొత్త కొత్త రంగుల చిగుళ్లు ,రంగు రంగుల పూలతో ప్రకృతి కూడా కొత్త శోభను సంతరించుకుంటుంది.
హోలీ  పండుగ చాలా విశిష్టమైనది యావత్‌ భారతదేశం అంతా పాల్గుణ మాసం పూర్ణిమ తిథి నాడు అత్యంత ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు.వసంత ఋతువు రాకను ఈ పండగ తెలియజేస్తుంది.శ్రీకృష్ణుని ఈ రోజే ఊయలలో వేసినట్లు శాస్త్రం చెబుతోంది. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నిలో ఆహుతి అయ్యాక హిమవంతునికి పార్వతిగా జన్మిస్తుంది.పార్వతి శివుణ్ణి సేవిస్తుంటుంది.ఆమె మీద శివుడికి మనసయ్యేందుకు మన్మధుడు పూల బాణాలను శివుడిమీద కురిపిస్తాడు.శివుడు కోపంతో మూడవ కన్ను తెరచి మన్మధుణ్ణి దహించి వేస్తాడు.అప్పుడు రతీదేవి పార్వతీ పరమేశ్వరులను పతి బిక్ష పెట్టమని కోరుతుంది.సర్వ మంగళ స్వరూపిణి అయిన పార్వతి శివుణ్ణి మెప్పించి ఆ శరీర రూపంతో సజీవుడై ఉండేటట్లు మాంగళ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. హోలీ ని’’కామునిపున్నమి’’ అనికూడా పిలుస్తారు. కాముడు అనగా మన్మధుడు .పాల్గుణ శుద్ధ పూర్ణిమ కి ముందు వచ్చే తొమ్మిది రోజులు సాయంత్రం వేళల్లో ఆడవారు ఐతే చప్పట్లు కొడుతూ, మగవారు ఐతే కోలాటం వేస్తూ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి ధాన్యాన్ని సేకరిస్తారు.కాముడు శివుడి ఆగ్రహానికి గురై దహించబడ్డ పురాణ కథకు సంకేతంగా నేటికీ హోలీ  కి ఒక రోజు ముందు రాత్రి కూడలి ప్రాంతాలలో కట్టెల్ని పేర్చి కామదహణం పేరుతో ,కాముడు కాలే కరిబోగ్గాయే అని పాటలు పాడుతూ దాని చుట్టూ తిరుగుతారు.
ఈ హోలీని దేశంలోని అన్ని ప్రాంతాలలోని ప్రజలు వయోభేధాన్ని విస్మరించి ప్రేమాను రాగాలతో జరుపుకుంటారు.పవిత్రమైన ప్రేమ,ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటారు.జాతీయ సమైక్యతకు,సనాతన సంస్కృతికి అపురూపమైన అనురాగానికి ,విశ్వమానవ ప్రేమకు సంకేతం ఈ హోలీ  పండగ.ఆనందాలకు నిలయంగా భారతీయులు జరుపుకునే విశిష్ట పండగ.ఆత్మీయత ను,బంధాలను చాటిచెబుతు సమైక్యతకు ప్రతిరూపంగా నిలిచే పండగ హోలీ . ఈ హోలీ  రోజు చిన్న పిల్లలకి కొత్తబట్టలు వేసి బిస్కెట్ల దండలను వేస్తారు. సంవత్సరం పొడవునా12 పూర్ణిమలు వస్తాయి.ఒక్కొక్క పూర్ణిమకి ఒక్కొక్క ప్రాధాన్యం ఉంది .అందులో హోలి కా పూర్ణిమ ఒకటి.మిగిలిన 11 పూర్ణిమ ల్లోనూ ఏదోఒక తీరుగా దైవ ధ్యానం చేయడం,ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ముడిపడి ఉండడం  సంప్రదాయం.కానీ హోలీ పూర్ణిమ మాత్రం దేనికి సంబంధించినది కాకుండా కేవలం వినోదమే ప్రధానంగా కనిపిస్తుంది.
ఈ పాల్గుణ పూర్ణిమకి సరిగ్గా ఇటు 15 రోజుల క్రితం శివరాత్రి వచ్చింది.ఇదే పాల్గుణ పూర్ణిమకి అటు పదిహేను రోజుల మీదట ఉగాది రాబోతుంది.ఇలా శివరాత్రి పర్వ దినం ఉగాది పండగల మధ్యరోజు ఈ హోలీ .శివరాత్రి నాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని. హోలీ  రోజు ప్రణాళిక…..ఉగాది రోజు ప్రణాళిక ను అమలు చేయాలని శాస్త్రం.అనగా శివరాత్రి నాడు ఆత్మ పరిశీలన, హేలిక పూర్ణిమ నాడు ప్రణాళిక రచన,ఉగాది నాడు కార్యనిర్వహణ లో శంకుస్థాపన జరగాలన్న మాట. శ్రీమహాలక్ష్మి  క్షిర సాగరం నుండి ఈ రోజే ఆవిర్భవించిందని పురాణ గాధ ఉంది.ఈ రోజు లక్ష్మీదేవి ని భక్తి శ్రద్ధలతో కొలిచి షోడశోపచారాలతో ఆరాధించి,లక్ష్మీ అష్టోత్తర శతనామాలు,కనకధార స్తోత్రం వంటివు పారాయణం చేయాలి.
మనం కూడా ఆ అమ్మవారిని స్మరిస్తూ ఆ లక్ష్మీ దేవి కృపకుపాత్రులమవుదాం.

 రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు

1.తెలిసినవారు,పొరుగువారు, మిత్ర బృందం ఒకరిపై ఒకరు ఆప్యాయతగా,ఆనందంగా,సరదాగా రంగులు జల్లుకుంటారు.
2.మరి రంగు చల్లుకునేప్పుడు తెలుకోవలసిన జాగ్రత్తలు చూద్దాం……
3.చర్మాన్ని,శిరోజాల్ని కాపాడు కోవడం ముఖ్యం.రంగుల్లోని రసాయనాలు
కళ్ళు,చర్మం,శిరోజాలు హాని కలిగిస్తాయి.
4.హోలీ  ఆడుతున్న సమయంలో ఎలాంటి తినుబండారాలు తీసుకోకూడదు.ఎందుకంటే మనం తీసుకునే ఆహారంతో పాటు రంగులు కూడా కడుపులోకి పోయి జీర్ణక్రియ శక్తిని తగ్గిస్తుంది.
5.హోలీ  ఆడే ముందు కోల్డ్‌ క్రీం,నూనె,బాడీ లోషన్‌ లాంటివి రాసుకోవడం మంచిది. ఇవి వాడటం వల్ల హోలీ  రంగులు చర్మం లోనికి వెళ్లకుండా నిరోధిస్తాయి.
6.రంగుల్ని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడాలి.
7.కళ్ళలో రంగులు పడితే మంచి నీటితో శుభ్రంగా కడుక్కొని డాక్టర్‌ ని సంప్రదించాలి.
8.చిన్నపిల్లల్ని,ఆస్తమా వ్యాధిగ్రస్తులు రంగులకి దూరంగా ఉండడం మంచిది.
9.సన్నని,పలుచని,సిల్క్‌ దుస్తువులు వాడితే మంచిది.
image.png
సంయుక్త
వరంగల్‌ జిల్లా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page