సాంస్కృతిక మార్పిడితోి పెట్టుబడులకు ఊతం

– పర్యాటక రంగాన్ని ఫ్రెంచ్ పర్యాటకులకు చేరువ చేద్దాం
– పర్యాటక మంత్రి జూపల్లి, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ లామీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణకు గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఉందని, హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతూనే తన సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షించుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియోలు సచివాలయంలో మంత్రి జూపల్లిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ-ఫ్రాన్స్ మధ్య పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, పెట్టుబడులు, ప్రజల మధ్య పరస్పర సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక విశేషాలను ఫ్రాన్స్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం, ఫ్రెంచ్ ఎంబసీ, పర్యాటక సంస్థలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. తెలంగాణ-ఫ్రాన్స్ మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలు, వారసత్వ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి అవకాశాలను గుర్తించేందుకు సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి బాటలు పడతాయని తెలిపారు. మార్క్ లామీ మాట్లాడుతూ పర్యాటకం దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు కీలక రంగమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటని, ఏటా పది కోట్లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నారని తెలిపారు. పర్యాటకం, సంస్కృతి రంగాల అభివృద్ధి ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. భారత్-ఫ్రాన్స్ మధ్య రక్షణ, ఔషధ తయారీ, సాంకేతిక రంగాల్లో బలమైన భాగస్వామ్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 200మంది ఫ్రెంచ్ పౌరులు నివసిస్తున్నారని తెలిపారు. తెలంగాణతో పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ రంగాల్లో మరింత సహకారానికి ఫ్రాన్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ఫ్రెంచ్ పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక సహకారానికి మరింత ఊతం

తెలంగాణ-కొరియా మధ్య పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్‌లో తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ- కొరియన్ కల్చరల్ సెంటర్‌లు సంయుక్తంగా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లోని కొరియన్ కల్చరల్ సెంటర్ (కేసీసీఐ) డైరెక్టర్, భారత్‌లోని కొరియా రాయబార కార్యాలయం కల్చర్ అండ్ ప్రెస్ కౌన్సిలర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి జూపల్లిని సచివాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, వైవిధ్యభరితమైన సంస్కృతి, సంప్రదాయ కళారూపాలు, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రతిపాదిత తెలంగాణ-కొరియా సాంస్కృతిక మహోత్సవం ద్వారా ఇరు ప్రాంతాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాలు, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆవిష్కరించే అవకాశం లభిస్తుందని, పర్యాటకాభివృద్ధితోపాటు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత పెరుగుతాయని తెలిపారు. భారత్‌లో కొరియన్ కే-డ్రామాలు, కొరియన్ వినోద కార్యక్రమాలకు ఓటీటీ వేదికల ద్వారా విశేష ఆదరణ లభిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కళలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, సృజనాత్మక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. పర్యాటకం, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ, సృజనాత్మక పరిశ్రమల రంగాల్లో కొరియాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో కిమ్ కాంగ్‌హున్ (హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, కేసీసీఐ), ఇమ్ హ్విజే (హెడ్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, కేసీసీఐ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొరియా కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *