నిజాయతీ, నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

– డీజీపీ ఆనంద్
– డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: పోలీసు శాఖలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) హోదా నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా పదోన్నతి పొందిన 36మంది అధికారులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, యూనిట్లలో సోమవారం పోస్టింగులు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ నూతనంగా పదోన్నతి పొందిన అధికారులను అభినందించారు. పదోన్నతి అనేది హోదా పెరగడం మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే అవకాశం అని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతీ అధికారి నిజాయతీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే గుర్తించి, చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని, ప్రజలకు చేరువయ్యే అధికారులుగా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల పెంపు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. డీఎస్పీ హోదాలో ప్రతీ నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించాలని కోరారు. ప్రజల భద్రత, సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అంకితభావంతో పనిచేస్తేనే వృత్తిపరంగా మరింత ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కాగా, డీస్పీలుగా పదోన్నతి పొందిన వీరు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోస్టింగ్స్ కాక ఇతర విభాగాల్లో తమ సేవలను అందించనున్నారు. కార్యక్రమంలో డీజీ(లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

————————————————————————————————————————————————————————————తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *