– ప్రధానిపై రెండు గ్రంథాలు రచించిన డాక్టర్ వకుళాభరణం
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై సమగ్ర విశ్లేషణతో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన రెండు గ్రంథాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం సందర్భంగా వీటిని ఆవిష్కరించారు. తొలి గ్రంథం ‘నరేంద్ర మోదీ.. భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు’. తెలుగు-హిందీ-ఆంగ్ల భాషల్లో రూపొందిన 600 పేజీల గ్రంథం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రపంచ దౌత్యంలో భారత స్థానం, ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠ పెరుగుదల, అంతర్జాతీయ వేదికలపై భారత పాత్ర, విశ్వ నేతగా మోదీ నాయకత్వాన్ని విశ్లేషించారు. రెండవ గ్రంథం ‘అంత్యోదయం నుండి వికసిత భారత్’. తెలుగు భాషలో రూపొందిన 500 పేజీల విశ్లేషణాత్మక గ్రంథం. కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు, పన్నెండేళ్లలో దేశంలో చోటుచేసుకున్న సామాజిక, ఆర్థిక, పరిపాలనా మార్పులు, సుపరిపాలన, వికసిత భారత్-2047 లక్ష్యాన్ని సమగ్రంగా విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల అమలు, ప్రజల జీవితాలపై వాటి ప్రభావాన్ని వివరించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్ల పాలన పూర్తి చేసుకొని పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ రెండు గ్రంథాలు వెలువడడం విశేషం. మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, దేశాభివృద్ధి ప్రస్థానాన్ని సమగ్ర సమాచారం, విశ్లేషణతో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ గ్రంథాలను రచించినట్లు డాక్టర్ వకుళాభరణం తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ రచయితను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ రెండు గ్రంథాలు విద్యార్థులు, పరిశోధకులు, ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సాధారణ పాఠకులకు విలువైన ప్రామాణిక సమాచార గ్రంథాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, పార్లమెంట్ సభ్యులు డి.కె.అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనసభాపక్ష నేత అలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, జాతీయ నాయకురాలు ఎ.రేఖాశర్మ, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





