– కార్యకర్తలే బలమైన శక్తి
– జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
సుబేదారి(హన్మకొండ ), ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణలో రాజకీయ మార్పు అనివార్యమని, 2029 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి అధ్యక్షుల భారీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన బూత్ అధ్యక్షులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలన, సమర్థ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆ ఆకాంక్షకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. 2029 ఎన్నికలు కేవలం అధికార మార్పు కోసం జరిగేవి కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉచిత ధాన్యం పంపిణీ, మౌలిక సదుపాయాల విస్తరణ, జాతీయ రహదారులు, రైల్వేలు, డిజిటల్ సేవల విస్తరణ, మహిళల సాధికారతకు చేపట్టిన కార్యక్రమాలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని ఆయన తెలిపారు. కరోనా సమయంలో స్వదేశీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించి కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజీ పడదని, ఉగ్రవాద నిర్మూలన, సరిహద్దుల రక్షణ, దేశ సమగ్రత పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని నితిన్ నవీన్ చెప్పారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, కాజీపేట రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం, పీవీ నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనలు, హెరిటేజ్ సిటీ అభివృద్ధి, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యా, వైద్య రంగాల విస్తరణ, బీబీనగర్ ఎయిమ్స్ వంటి అనేక ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. వరంగల్‌ను పరిశ్రమలు, విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో దేశంలోనే ప్రముఖ నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు 2029 విజయానికి సెమీఫైనల్‌లాంటివని పేర్కొన్న నితిన్ నవీన్, ప్రతి బూత్‌లో విజయం సాధించే లక్ష్యంతో కార్యకర్తలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీకి రాయబారిగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందని, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, వాటి గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్‌లో సాధించిన విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బీజేపీ విజయపతాకం ఎగరాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయించినప్పటికీ వాటి గురించి ప్రజలకు పూర్తి సమాచారం చేరడం లేదన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం పంపే ప్రతి రూపాయి ప్రజల అభివృద్ధికే వినియోగించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని ఆయన అన్నారు. డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు, సేవా కార్యక్రమాలు, కార్యకర్తల అంకితభావమే పార్టీ విజయానికి మూలస్తంభాలని అన్నారు. . సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగే పార్టీ బీజేపీ మాత్రమేనని, తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బిజెపి నేతలు ప్రొఫెసర్ ఎ. సీతారాంనాయక్, ప్రేమె oదరరెడ్డి రావు పద్మ, ధర్మారావు, రాజేశ్వరరావు, గంటా రవి కుమార్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





