హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయండి

– హైదరాబాద్ తర్వాత మోదీ అత్యధిక నిధులిచ్చింది వరంగల్‌కే
– అయినా చినుకు పడితే మునిగిపోవడం బాధాకరం
– కార్యకర్తలారా స్థానిక సమస్యలపై పోరుబాట పట్టండి
– మేయర్ పీఠాన్ని గెలిచి మోదీ, నబిన్‌లకు గిఫ్ట్ ఇద్దాం
– వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి

వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్ తరువాత అత్యధికంగా నిధులిచ్చింది వరంగల్ కార్పొరేషన్‌కేనని చెప్పారు. స్మార్ట్ సిటీ నిధులను నాటి బీఆర్‌ఎస్ నేతలు స్వాహా చేశారని, అందుకే చినుకు పడితే వరంగల్ మునిగిపోయే దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈసారి వరంగల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. వరంగల్‌లో జరిగిన పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులు సమావేశానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఫస్ట్ మీతో బెట్టు కడతా.. మీరు రెడీనా.. హైదరాబాద్ కార్పొరేషన్ గెలుస్తరా.. వరంగల్ కార్పొరేషన్ గెలిపిస్తారా.. మీతో అవుతుందా అనగానే మేం రెడీ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మీ కమిట్‌మెంట్‌ను చూసి నితిన్ నబీ ఇక్కడికి వచ్చారు.. ఎక్కడ చూసినా వరంగల్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని తేలిపోయింది అని అన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ బీఆర్‌ఎస్‌కు అభ్యర్థి లేరు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అంతే. కరీంనగర్ కార్పొరేషన్‌లో ఎవరు గెలిచారు.. బీజేపీ. ఇవాళ గల్లీగల్లీలో కాషాయ కార్యకర్త గల్లా ఎగరేసుకుని తిరుగుతున్నారు.. ఇప్పుడు వరంగల్‌కు ఆ అవకాశం వచ్చిందని అన్నారు. కరీంనగర్‌లో స్మార్ట్ సిటీ పైసలతో అబివృద్ది జరిగింది.. వరంగల్‌కు కూడా ఇచ్చినా ఎందుకు అభివృద్ది జరగలేదు.. మోదీ పైసలన్నీ యాడ పోయినయ్. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వస్తే గల్లా పట్టి నిలదీయండి అని చెప్పారు. వరంగల్‌కు స్మార్ట్ సిటీ, అమృత్ 1, 2 నిధులతోపాటు కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్ పార్క్ సహా కేంద్రం ఎన్నో ప్రాజెక్టులకు నిధులిచ్చిందన్నారు. 12 ఏళ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. కేంద్ర నిధులపై చర్చకు రావాలంటూ కిషన్ రెడ్డి సవాల్ చేస్తే తోకముడిచారని ఎద్దేవా చేశారు. వరంగల్ నాది.. గెలిపించే బాధ్యత మేమంతా తీసుకుంటాం అన్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు సర్వే చేస్తే వరంగల్‌లో ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశముందని రిపోర్టు వచ్చింది.. తర్వాత పదికికి పైగా గెలిచాం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 26 సీట్లు పక్కా గెలుస్తాం.. ఇంకా కష్టపడితే మరో 20 సీట్లు గెలుస్తామని రిపోర్టు వచ్చింది అని చెప్పారు. ఈరోజు నుండే ప్రతీ కార్యకర్త వరంగల్ లోని ఇంటింటికీ వెళ్లాలి.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్కో ఇంటికి ఆరుసార్లు వెళ్లండి.. కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు చెప్పండి అని పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓట్లేసి గెలిపిస్తే కేంద్ర నిధులన్నీ దుర్వినియోగమై అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పాలన్నారు. బెంగాల్‌ను గెలిపించిన నితిన్ నబిన్ తెలంగాణపై దృష్టి పెట్టారన్నారు. తెలంగాణలో బీజేపీ గెలవడం ఫైనల్ మ్యాచ్.. అంతకుముందు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట ఎన్నికలు మనకు సెమీ పైనల్.. ఈ సెమీ ఫైనల్‌లో బీజేపీ గెలిచి తీరాలి అని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త తమతమ డివిజన్‌లలో కచ్చితంగా బీజేపీ అభ్యర్ధిని గెలిపించుకుంటానని ప్రతిజ్ఞ చేయాలన్నారు. మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమనే సంకేతాన్ని ప్రజలకు పంపండి అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను గెలిపించిన వెంటనే మోదీని కలిసి కరీంనగర్ కార్పొరేషన్‌కు సాయం చేయాలని కోరిన. వెంటనే రూ.840 కోట్లు ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కో ఆప్షన్ సభ్యులంతా బీజేపీ వాళ్లే. ఎంఐఎంకు వణుకు పుట్టింది. చివరకు ముస్లిం కార్పొరేటర్లు కూడా బీజేపీ అభ్యర్ధికి ఓటేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోండి. ఇక్కడి దారుస్సలాం ఉన్న డివిజన్‌లో కూడా బీజేపీ అభ్యర్ధి గెలిచారు. ఎంఐఎం గెలిచే సీట్లను కూడా ఈసారి బీజేపీ కైవసం చేసుకుంది. అదే ఊపులో వరంగల్ కార్పొరేషన్‌ను కూడా గెలిపించుకుందాం.. నరేంద్రమోదీ, నితిన్ నబిన్‌కు గిఫ్ట్ ఇద్దాం అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *