అందుబాటులోని నీటిని చూసే పంటల ప్రణాళిక

– సాగు, తాగునీటి అవసరాల మధ్య సమతుల్యత తప్పనిసరి
` పులిచింతల వెనుక జలాలతో 53 వేల ఎకరాలకు సాగునీటి భరోసా
– దొండపాడు ఎత్తిపోతల |ం పనులు డిసెంబర్ నాటికి కీలక దశకు చేరాలి
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 20 : ఆకాశం కరుణిస్తుందనే ఆశ ఒక్కటే సాగుకు ఆధారం కాకూడదని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ అంచనాల మేరకు వర్షాలు బలహీనంగా ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలో మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పనులను గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి జిల్లాలో సాగునీటి పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి, జలాశయాల్లో నీటి లభ్యతపై సమీక్షించారు. వర్షపాతం, జలాశయాల్లో నిల్వలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందని, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను అత్యంత వివేకంతో వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షపాతం లోటు కారణంగా నాగార్జునసాగర్ సహా ప్రధాన జలాశయాలకు ఆశించిన స్థాయిలో ప్రవాహాలు చేరడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వర్షాలు కురుస్తాయనే అంచనాలపై కాక వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకునే సాగునీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వేసవి పూర్తయ్యే వరకు, వచ్చే వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలను కాపాడుకోవడం ప్రభుత్వానికి అత్యంత కీలకం అని స్పష్టం చేశారు. ఎల్‌నినో అనేది హుజూర్‌నగర్‌కో, సూర్యాపేట జిల్లాకో, తెలంగాణకో పరిమితమైన పరిణామం కాదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను ప్రభావితం చేసే పరిస్థితి అని మంత్రి వివరించారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పులను అర్థం చేసుకుని, మనకు వాస్తవంగా లభ్యమవుతున్న జలవనరుల ఆధారంగానే వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వర్షం వస్తుందనే ఆశతో పంట వేయడం కన్నా.. పంట చివరి వరకు నీరు అందుతుందా లేదా అన్న భరోసాతో నిర్ణయం తీసుకోవాలి.. రైతులు తమకు అందుబాటులో ఉన్న నమ్మకమైన నీటి వనరులను అంచనా వేసుకుని పంటలను ఎంపిక చేసుకోవాలి.. సాగుకు నీరు ఇవ్వగలిగినచోట రైతును ఆదుకుంటాం.. అదే సమయంలో వేసవి దాటి వచ్చే వర్షాకాలం వరకు ప్రజల గొంతు తడిపే తాగునీటిని కూడా కాపాడుకోవాలి’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సాగు, తాగునీరు రెండూ ప్రజల జీవనాధారాలేనని, ఒకదాని కోసం మరొకదానిని ప్రమాదంలోకి నెట్టే విధానం ప్రభుత్వానికి లేదని అన్నారు. జలాశయాల్లో వినియోగానికి అందుబాటులో ఉన్న వాస్తవ నిల్వలు, ఎగువ నుంచి వచ్చే విశ్వసనీయ ప్రవాహాలు, రానున్న కాలంలో వర్షపాతంపై శాస్త్రీయ అంచనాలను పరిగణనలోకి తీసుకున్నాకే నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్‌లల్లో వర్షాలు తగ్గే అవకాశాలపై వస్తున్న వాతావరణ అంచనాలను వ్యవసాయ, జల నిర్వహణ నిర్ణయాల్లో తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే కృష్ణా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు ప్రత్యామ్నాయ సాగునీటి భద్రత కల్పించే మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకానికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో సుమారు 53 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. దాదాపు 19,297 కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుండగా, వారిలో సుమారు 5,080 గిరిజన కుటుంబాలు, 3,540 షెడ్యూల్డ్ కులాల కుటుంబాలు ఉన్నాయని వివరించారు. నాగార్జునసాగర్‌లో అవసరమైన స్థాయిలో నీటి లభ్యత లేని సందర్భాల్లో రైతాంగానికి ప్రత్యామ్నాయ భరోసా కల్పించేలా పులిచింతల ప్రాజెక్టు వెనుక జలాల నుంచి నీటిని ఎత్తిపోసే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. వాతావరణ అనిశ్చితి పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యామ్నాయ జలవనరులే భవిష్యత్తులో రైతాంగానికి రక్షణ కవచంగా నిలుస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. పథకంలో భాగంగా నిర్మించాల్సిన దాదాపు 40 కి.మీ కాలువల వ్యవస్థలో ఇప్పటికే సుమారు 30 కి.మీ మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండు పంపులు, మోటార్లు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నాయని, మిగిలిన రెండు సెట్లు సెప్టెంబర్ ఆఖరులోగా చేరే అవకాశం ఉందని చెప్పారు. పంప్‌హౌస్, ప్రధాన కాల్వ, గేట్ రెగ్యులేటర్, డెలివరీ వ్యవస్థతోపాటు మిగిలిన పనులను వేగవంతం చేసి ప్రధాన పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగాలని ఇంజినీర్లను ఆదేశించారు. పథకం నిర్వహణకు అత్యంత కీలకమైన ప్రత్యేక 132 కేవీ సబ్‌స్టేషన్ పనులను కూడా తక్షణమే వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సాగునీటి వ్యవస్థ సిద్ధమైన తర్వాత విద్యుత్ మౌలిక సదుపాయాల కారణంగా ఒక్కరోజు కూడా నీటి విడుదల ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులతో సమాంతరంగానే విద్యుత్ వ్యవస్థను పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షపాతం పరిస్థితి ప్రభుత్వానికి రెండు బాధ్యతలను ఒకేసారి గుర్తు చేస్తోందన్నారు. ఒకవైపు శాశ్వత సాగునీటి మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేయాలి.. మరోవైపు ప్రస్తుతం చేతిలో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, శాస్త్రీయంగా వినియోగించుకోవాలి అని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌ల్లోనూ వర్షపాతం బలహీనంగా ఉంటే నీటి వనరులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ‘నీరు ఉన్నంతవరకు రైతుకు భరోసా కల్పిస్తాం.. అదే నీటితో ప్రజల తాగునీటి భవిష్యత్తునూ కాపాడతాం.. ప్రతి నీటి చుక్క వెనుక ఒక పంట ఉంది.. ఒక కుటుంబం ఉంది.. ఒక గ్రామం దాహం ఉంది. అందుకే ప్రతి నిర్ణయం బాధ్యతతోనే ఉండాలి’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పర్యటన, సమీక్షలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహతోపాటు నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

హుజూర్ నగర్ ను సస్యశ్యామలం చేస్తా

కృష్ణా జలాలతో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద రూ.1,648 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను గురువారం ఆయన పరిశీలించారు. ముందుగా అండర్గ్రౌండ్ పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

53 వేల ఎకరాలకు నీరు

కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 16 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మట్టంపల్లి మండలంలోని 9 గ్రామాల్లో 20,466 ఎకరాలు, మేళ్లచెరువు మండలంలోని 5 గ్రామాల్లో 15,829 ఎకరాలు, చింతలపాలెం మండలంలోని 9 గ్రామాల్లో 16,705 ఎకరాలు.. మొత్తం 53 వేల ఎకరాలకు సాగునీరు అందు తుందని చెప్పారు.

19,295 కుటుంబాలకు ప్రయోజనం

ప్రాజెక్టు ద్వారా 5,080 ఎస్టీ, 3,540 ఎస్సీ, 8,470 బీసీ, 2,205 ఓసీ కుటుంబాలు.. మొత్తం 19,295 కుటుంబాలు లబ్ధి పొందుతాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం 191 ఎకరాల రైతుల భూములను కొనుగోలు చేసి, వారికి రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు బ్యాక్వాటర్ను వినియోగించుకుని ఈ ప్రాంతంలోని గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. డిసెంబరు నాటికి ప్రాజెక్టు రూఫ్ టాప్ లెవెల్, పంప్ హౌస్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా మిగి లిన పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని గుత్తేదారులను ఆదేశించారు. అనంతరం మఠంపల్లి, పాలకీడు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ సందాల్ పవార్, జిల్లా ఎస్పీ కె.నరసింహ, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *