– కొందరు 4శాతం రిజర్వేషన్లపై కోర్టు మెట్లెక్కారు
– ఇంటింటికీ వెళ్ళి వోట్ల గల్లంతును పరిశీలించండి
– మైనార్టీల ప్రతిభా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముస్లింలకు కాంగ్రెస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల రద్దు కోసం అత్యున్నత న్యాయస్థానాల వరకూ వెళ్లారని ముఖ్యమంత్రి విమర్శించారు. అయినా చిత్తశుద్ధితో కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మైనారిటీల ప్రతిభా సదస్సుకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన పలువురు మైనారిటీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీ రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నేతృత్వంలోనే మైనారిటీలకు సంక్షేమం అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని, హిందూ, ముస్లింలను రెండుకళ్లలా చూస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలను నిర్వహించలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఓ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను టీజీపీఎస్సీ సభ్యుడిగా నియమించారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం దేశంలో సెక్యులర్ వర్గాలకు మనుగడ ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా కాంగ్రెస్ చూస్తోందని చెప్పారు. నగరంలోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో మైనారిటీస్ ఎక్స్‌లెన్స్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇచ్చింది. వాటిని రద్దు చేయాలని కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌లో మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి చూపాలని సవాల్ విసిరాం. లౌకిక వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుంది. బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగం, రూ.3కోట్ల ప్రోత్సాహకం ఇచ్చాం. బీఆర్‌ఎస్ హయాంలో గ్రూప్-1 నియామకాల ఊసే లేదు. ఒకసారి నియామకాలు చేపట్టినా పల్లీ, బఠానీల్లా ప్రశ్నపత్రాలు అమ్మారు. మా ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. అందులో విద్యావంతులను నియమించాం. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్-1 పోస్టులు భర్తీ చేశాం. గ్రూప్-1 రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అక్కడ మంచి న్యాయవాదిని పెట్టి వాదనలు వినిపించాం. తద్వారా నియామకాలు పూర్తిచేశాం. గ్రూప్ 2, 3, 4 పోస్టుల విషయంలోనూ కోర్టుల్లో పోరాడి ఉద్యోగాలు భర్తీ చేశాం‘అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేశామని ధీమా వ్యక్తం చేశారు. రిటైర్డ్ డీజీపీని టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించామని చెప్పుకొచ్చారు. ఎంతో పారదర్శకంగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నిఖత్ జరీన్ కోసం నిబంధనలు పక్కనపెట్టి మరీ గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చామని, అలాగే క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించామని సీఎం రేవంత్ గుర్తు చేశారు. మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలని కోరారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను అందరి సహకారంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నట్లు రేవంత్ చెప్పుకొచ్చారు. సర్ పేరుతో వోట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బెంగాల్‌లో గెలిచామని, ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్కడ మమతా బెనర్జీ వదిలేశారేమో కానీ, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని హెచ్చరించారు. ’గల్లీ గల్లీ తిరగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతీ ఒక్కరి వోటును చెక్ చేయండి’ అంటూ కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిలాగా మారి ప్రజల వోటు హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు