హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా (corona) మహమ్మారి మళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో Covid-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన మహిళకు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడిచారు.
కొరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మిగతా వారికి దూరంగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మందులు వాడాలని తెలిపారు. ప్రయాణాల్లోనూ, సమూహాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు వాడాలని అధికారులు తెలిపారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
భారీగా కేసుల నమోదు..
మే 19నాటికి దేశవ్యాప్తంగా 257 కొవిడ్ కేసులు (Covid 19 cases) నమోదైనట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, దవాఖానాల్లో చేరాల్సిన అవసరం లేదని వెల్లడించింది. సింగపూర్, హాంకాంగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తమయ్యామని పేర్కొంది. సింగపూర్, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.