– సాగు, తాగునీరు, పశుసంపద, విద్యుత్ రంగాలపై ప్రత్యేక దృష్టి
– 17 జిల్లాల్లో 20 నుంచి 46 శాతం వరకు తక్కువ వర్షపాతం
– ఎల్‌నినోపై చర్చలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాలపై ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనసభలో ఎల్‌నినోపై శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో గతంలో 1951, 1965, 1972, 1982, 1987, 2002, 2015 సంవత్సరాల్లో వచ్చినప్పటికీ ఈసారి మాత్రం చాలా క్లిష్ఠమైన పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు. దీని ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే గణనీయమైన లోటు నమోదవుతోందని తెలిపారు ఈ నెల 10 వరకు నమోదైన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరిలో 21 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, మెదక్‌లో 23 శాతం, వికారాబాద్‌లో 26 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 28 శాతం, జనగామలో 30 శాతం, ఆదిలాబాద్‌లో 31 శాతం, మహబూబ్‌నగర్‌లో 32 శాతం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలో 33 శాతం, సూర్యాపేటలో 34 శాతం, వరంగల్, ఖమ్మంలో 37 శాతం, నారాయణపేటలో 38 శాతం, నాగర్‌కర్నూల్‌లో 39 శాతం, వనపర్తిలో 41 శాతం, హనుమకొండలో 42 శాతం, జోగులాంబ గద్వాలలో 46 శాతం వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని కొన్ని మండలాల్లో ఒకేసారి క్లౌడ్ బరస్ట్ జరిగిందని వివరించారు. ఒక నెలలో పడాల్సిన వర్షం ఒక గంటలో కురిస్తే రికార్డులలో వర్షపాతం నమోదైనా వాస్తవానికి ఆ నీరు ప్రజలకు ఉపయోగపడదని వివరించారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ముందస్తు సమీక్షలు
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారని, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో రైతులు ఏ పంటలు సాగు చేయాలి, అందుబాటులో ఉన్న నీటిని ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో మండలాలు, ప్రధాన గ్రామాల వారీగా సమీక్షలు నిర్వహించారని చెప్పారు. జూలై 17న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల రాబోయే పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నష్ట నివారణ చర్యలు చేపట్టారని చెప్పారు.
33 లక్షల పంప్‌సెట్లకు నిరంతర విద్యుత్
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 33 లక్షల పంప్‌సెట్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిందన్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సుమారు 19,575 మెగావాట్లకు చేరిందని, ఇలాంటి పరిస్థితుల్లోనూ రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పశుసంపదపైనా ప్రత్యేక దృష్టి
ఎల్‌నినో ప్రభావం కేవలం వ్యవసాయం, తాగునీటికే పరిమితం కాదని, పశుసంపదపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పశువులకు మేత, నీటి లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని కేబినెట్‌లోనే పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
కేంద్రం నుంచి సహకారం అవసరం
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని మంత్రి కోరారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కేంద్ర సహకారం కోరుతూ తీర్మానం చేసిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారని తెలిపారు. ప్రజలను ఎల్‌నినో ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ముందస్తు చర్యలు తీసుకుంటోందని, కేంద్రం కూడా అన్ని రంగాల్లో రాష్ట్రానికి పూర్తి సహకారం అందించాలని మంత్రి పొంగులేటి కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఇదేనని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





