ఆదాయ మార్గాలను అన్వేషించాలి

– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
– జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు
– ల్యాండ్ పూలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి.
– రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం లోతుగా సమీక్షించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన పన్ను ఆదాయాన్ని గరిష్ఠంగా రాబట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖను, ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో తెలంగాణకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలను మరింత సమర్థవంతంగా కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర ఆదాయంలో కీలకమైన ఎక్సైజ్ శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఇందుకోసం తక్షణమే ఒక స్పష్టమైన, పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు తక్షణమే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరి సందీప్ కూమార్ సుల్తానీయాను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో భూముల మానిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని ప్రభుత్వ భూసంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అధికారులు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గతంలో ఉప్పల్ భగాయత్ ప్రాజెక్టు విజయవంతం కాగా, మోకిల, బుద్వేల్‌లలోనూ మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని ల్యాండ్ పూలింగ్ పురోగతిని స్పెషల్ చీఫ్ సెక్రటరి జయేష్ రంజన్ సమావేశంలో వివరించారు. ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలను అవలంబిస్తూ నగర పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టడానికి గల అవకాశాలను తక్షణమే గుర్తించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) ప్రాజెక్టును వేగవంతం చేయడంపై సబ్ కమిటీ ప్రత్యేకంగా చర్చించింది. ‘హిల్ట్’ కింద జారీ చేయాల్సిన నోటిఫికేషన్లకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) పూర్తిస్థాయిలో సహకరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజల్లో, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో ఉత్తరప్రదేశ్, హర్యానాల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని, గత ఆరు నెలల్లో తీసుకున్న పటిష్ట చర్యల వల్ల జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ పెరిగిందని వాణిజ్య పన్నుల (కమర్షియల్ టాక్సెస్ అండ్ జీఎస్టీ) కమిషనర్ రఘునందన్ రావు మంత్రులకు వివరించారు. సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, సీనియర్ అధికారులు రఘునందన్ రావు, శశాంక, కృష్ణభాస్కర్, నిఖిల్ చక్రవర్తి, పురపాలక (ఎంఏయÖడీ), పరిశ్రమలు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *