– పాలేరు పరిధిలో రూ.37.38 కోట్లతో విద్యుత్ పనులు
– సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన
– రెవెన్యూ మంత్రి పొంగులేటి
తిరుమలాయపాలెం/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు, విద్యుత్ నియంత్రికల మరమ్మతు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. గతంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా కారణంగా పొలాలకు వెళ్లిన రైతులు పాముకాటుకు గురయ్యే వారని తెలిపారు. మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. గత రెండున్నరేళ్లలో పాలేరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అభివృద్ధి పనుల కోసం రూ.37.38 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు. ఇళ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. రూ.9 కోట్లతో మూడు సబ్‌స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ శ్రీనివాసచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కులు
తిరుమలాయపాలెం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరో రెండు వేల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రెండున్నరేళ్లలో కూడా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని అనుకూలమైన పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాసచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



