కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

– గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి
– రైతులకు నీళ్లు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం
– నీరు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్య‌మం
– ఎన్‌డీఎస్ ఏ వంక‌తో కాళేశ్వ‌రం నీరు ఎత్తిపోయ‌డంలేదు
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: తన అబద్ధాలు బయటపడతాయన్న ఏకైక కారణంతోనే ఒకవైపు గోదావరిలో నీరు భారీగా కిందికి వృథాగా పోతుంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నల గొంతు ఎండబెడుతూ, పంట పొలాలను ఎండబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పనికిరాదు అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు. రిటైర్డ్ ఇంజనీర్లు. ఇరిగేషన్ నిపుణులు చేస్తున్న సూచనలు జీర్ణించుకోలేక వారిపై తిట్ల దండకం అందుకున్నారన్నారు. గత ప్రభుత్వంపైన, కాళేశ్వరం ప్రాజెక్టు పై గుడ్డి ద్వేషంతో నీళ్లు ఎత్తిపోయడం లేదన్నారు. ఇప్పటికైనా నీటిని ఎత్తిపోయకుంటే ప్రజలు కాంగ్రెస్‌ని తన్ని తరుముతారు అన్నారు. వెంటనే రైతన్నలు డిమాండ్ చేస్తున్న మేరకు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రాకముందు వరకు నిండుకుండలా ఉండేదని, కాంగ్రెస్ రాగానే మిడ్ మానేరు ఎండిపోతున్నది అన్నారు. కరువు ముంగిట నిలబడ్డ తెలంగాణకు కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తే రైతన్నలకు ప్రజలకు సాగు, తాగునీటి సంక్షోభం లేకుండా చేయవచ్చు అన్నారు. రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి రాజకీయ కక్షసాధింపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకొని వెంటనే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. గోదావరిలో వరద లేదని ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు చెబుతున్నారని, వాస్తవానికి టీఎంసీల కొద్దీ నీరు కిందికి పోతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే నీటిని ఎత్తిపోసుకుంటోందని కేటీఆర్ పేర్కొన్నారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే తెలంగాణ రైతులకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నప్పటికీ మేడిగడ్డ గేట్లు దించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా దాదాపు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ అవకాశం వినియోగించుకోవడం లేదన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం బీజేపీ ఇచ్చిన అక్రమ ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపిస్తూ పంటలను ఎండబెడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోసే విషయంలో కాంగ్రెస్ , బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికే తగిన మరమ్మతులు పూర్తి అయ్యాయని సాగునీటి శాఖ మంత్రి ఒకవైపు చెబుతున్నా మరోవైపు ఎన్ డిఎస్ ఏ రిపోర్ట్ పేరుతో అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అది ముమ్మాటికి రాజకీయంగా రాసిన అబద్ధాల రిపోర్ట్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వల్ల లోయర్ మానేరు, మిడ్ మానేరు మాత్రమే కాక మొత్తం గోదావరి బేసిన్‌కు చెందిన అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల కారణంగా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభంతో పాటు తాగునీటి సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎల్లంపల్లి నుంచి కూడా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోవడంతో చివరికి హైదరాబాద్ నగరానికే తాగునీటి సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి లోయర్ మానేరు ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయడం వల్ల కరీంనగర్ నగరానికి రోజూ తాగునీటి సరఫరా జరిగేదని, ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు తాగునీటి కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సాగునీటి హక్కుల కోసం పోరాడిన సీనియర్ ఇంజనీర్లను అవమానించడం దురదృష్టకరమన్నారు. న్యాయమైన జలహక్కుల కోసం పోరాడిన వారి సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. ‘కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసాలంటే మా రక్తం కావాలి’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ‘మా రక్తం కావాలంటే తీసుకోండి.. కానీ రైతన్నలకు నీళ్లు ఇవ్వండి’ అనే సందేశంతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రశాంత్ రెడ్డితోపాటు పార్టీ విద్యార్థి, యువజన విభాగాల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదానం చేసి ముఖ్యమంత్రికి పంపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కూడా బీజేపీ ఇచ్చిన అక్రమ ఎన్డీఎస్ఏ నివేదికను ప్రభుత్వం సాకుగా చూపిస్తూ రైతులకు నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. 28.5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్న మేడిగడ్డతోపాటు ఇతర బ్యారేజీలు లక్ష క్యూసెక్కుల నీటిని కూడా తట్టుకోలేవని చెప్పడం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.  రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *