– నిర్లక్ష్యం, ఆలస్యాన్ని సహించేది లేదు
– యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
– ఆదర్శ విద్యా సంస్థగా వైఐపీఎస్
– డీపీజీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(వైఐపీఎస్) నిర్మాణ పనుల్లో జాప్యంపై డీజీపీ సి.వి.ఆనంద్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు సి.వి. ఆనంద్అ ధ్యక్షతన సొసైటీ కమిటీ సమావేశం నిర్వహించారు.నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఆలస్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆయన కఠినంగా ఆదేశించారు. ప్రతి పనిని నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో పాటు వేగానికి కూడా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్చరించారు. దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విద్యాసంస్థలో పోలీస్ కుటుంబాల పిల్లలతో పాటు సాధారణ కుటుంబాల పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక మౌలిక వసతులు, ఆధునిక బోధనా విధానాలు, విలువలతో కూడిన విద్య, క్రీడలు, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత కల్పిస్తూ విద్యాబోధన కొనసాగుతోంది. సమావేశంలో పాఠశాల రెండో విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇప్పటివరకు సాధించిన పురోగతిపై డిజిపి సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 345 మంది విద్యార్థులు నమోదు కాగా, 2026–27 విద్యా సంవత్సరానికి 360 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు అధికారులు వివరించారు. గత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నిర్వహించగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిని ప్రారంభించారు. ప్రస్తుతం నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు బోధన కొనసాగుతున్న ఈ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో మొత్తం 360 మంది విద్యార్థుల్లో 184 మంది పోలీస్ కుటుంబాలకు చెందినవారు, 176 మంది నాన్-పోలీస్ కుటుంబాలకు చెందినవారు ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో అందిస్తున్న నాణ్యమైన విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని సభ్యులు అభిప్రాయపడ్డారు. పాఠశాల విస్తరణలో భాగంగా నూతనంగా 17 తరగతి గదులతో కూడిన నూతన అకాడమిక్ బ్లాక్ నిర్మాణ నమూనాను డిజిపి కి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, సృజనాత్మకతను పెంపొందించేలా ప్రపంచ స్థాయి విద్యను అందించాలని అన్నారు. విద్యతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు, సురక్షితమైన విద్యా వాతావరణం, ఆధునిక బోధనా పద్ధతులను కల్పించడంతో పాటు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందడంతో పాటు మాదకద్రవ్యాలు వంటి సామాజిక దురలవాట్లకు దూరంగా ఉండే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పిల్లలు సురక్షిత వాతావరణంలో విద్యనభ్యసిస్తారనే నమ్మకం తల్లిదండ్రుల్లో ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని డీజీపీ అన్నారు.
పాఠశాల పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రొక్యూర్‌మెంట్ కమిటీ, అకాడమిక్ కమిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. విధివిధానాలను సమావేశంలో ఆమోదించారు. విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు, విద్యా కార్యక్రమాలు, బోధనా విధానాలు, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సొసైటీ సభ్యులకు వివరించారు. నూతన అకాడమిక్ బ్లాక్ నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రతి అంశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని డిజిపి అధికారులకు సూచించారు. సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, డీజీ(గ్రేహౌండ్స్ & ఆక్టోపస్) డాక్టర్ అనిల్ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఐజీ (ప్రొవిజనింగ్ & లాజిస్టిక్స్) గజరావు భూపాల్, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ కుమార్, ఏఐజీ (లా & ఆర్డర్) రమణ కుమార్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రిన్సిపల్ అనితా రెడ్డి, సీఎస్ఆర్ కోఆర్డినేటర్ దీప్తి, జీఎం రాజేష్, విశాల్, సతీష్, సాక్షి, సొసైటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





