– హైదరాబాద్ కు ఐఐఎం.. మెట్రో విస్తరణే లక్ష్యం
– ఐఐఎం సాధనలో బీజేపీ ఎంపీలు చొరవ చూపాలి
– ఏపీ నుంచి ‘ఎన్ఓసీ’లు.. కేంద్రం రాయబారం కీలకం
– ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉంటేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించగలమని, రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు ఐఐఎంను తీసుకురావాలని, ఇందుకు బీజేపీ ఎంపీలు చొరవ చూపాలని కోరారు. మెట్రో విస్తరణకు కేంద్ర సహకారం అవసరం అంటూ ఇందుకు సంబంధించి రుణాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చూడాలన్నారు. భూసేకరణ ఒక కొలిక్కి వచ్చిందని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని ఆరఆరఆర్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం అనుమతులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీలను ఆయన కోరారు. సాగునీటికి సంబంధించి తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఆర్ పాటిల్‌తో చర్చించామని, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంవోసీ ఇవ్వాల్సి ఉందని, డిండి-30 టీఎంసీలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు-90 టీఎంసీలకు ఎంవోసీ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ అంశం చర్చల దశలో ఉందని, ఈ విషయంలో కేంద్రం కూడా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. 120 టీఎంసీలకు కేంద్రం అనుమతులు వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసుకోవచ్చునన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని, కేంద్రం సహకరిస్తే కేంద్రం సహకరించిందని తాము నిరభ్యంతరంగా చెబుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఒప్పుకునేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. తుమ్మిడిహట్టి, పోర్ట్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన అనుమతులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా చూడాలన్నారు.
మాకు ఎలాంటి భేషజాలు లేవు : ఉప ముఖ్యమంత్రి భట్టి
ఎలాంటి భేషజాలు లేకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటాలను, నిధులను సాధ్యమైనంత వరకు సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంపీలు అందించిన ప్రతి సలహాను, సూచనను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు నోట్ చేసుకున్నారని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శితోపాటు సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వివిధ శాఖల కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం రాసే ప్రతీ లేఖ ప్రతులను తప్పనిసరిగా తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రటరీకి పంపాలని చెప్పారు. గతంలో పంపిన లేఖలు, భవిష్యత్తులో పంపే ఉత్తరాలు, పెండింగ్ అంశాలన్నింటినీ శాఖల వారీగా క్రోడీకరించి ఒక స్పష్టమైన డ్రాఫ్ట్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందజేస్తారని, తద్వారా ఎంపీలు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం, సహకారం అందించేందుకు తెలంగాణ భవన్‌లో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక టీమ్‌ను అందుబాటులో ఉంచుతుందని ప్రకటించారు. క్వశ్చన్ అవర్‌లో సప్లిమెంటరీ ప్రశ్నలు అడగడానికి అవసరమైన డేటాను ఈ టీమ్ అందిస్తుందన్నారు.
ప్రజాస్వామ్య విలువలను బలంగా నమ్ముతాం
కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘ఫెడరల్ స్పిరిట’ (సమాఖ్య స్ఫూర్తి), ప్రజాస్వామ్య విలువలను తాము బలంగా నమ్ముతామని డిప్యూటీ సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ప్రతి సందర్భంలోనూ ఒక పార్టీ తరఫున కాకుండా రాష్ట్ర ప్రభుత్వంగానే వెళ్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ప్రజాప్రభుత్వంలో భాగమైనా తాము రాజకీయాలు చేయడం లేదని చెప్పారు. వివిధ కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేకపోయిన ఇతర ఎంపీలను కూడా కలిసి ఈ సమన్వయ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని అధికారులను ఆయన కోరారు. భవిష్యత్తులో పార్లమెంట్ నోటిఫికేషన్ రాగానే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా క్వశ్చన్ అవర్ కంటే ముందే ప్రశ్నలు పంపుకోవడానికి వీలవుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రస్తుత సమావేశాల నేపథ్యంలో క్వశ్చన్ అవర్, జీరో అవర్, స్టాండింగ్ కమిటీలు, కన్సల్టేటివ్ కమిటీల వంటివి అందుబాటులో ఉన్న ప్రతి ఫార్మాట్‌ను ఉపయోగించుకొని కేంద్రం దృష్టికి రాష్ట్ర అంశాలను తీసుకెళ్లాలని ఎంపీలను డిప్యూటీ సీఎం కోరారు. దీనితోపాటు అందరూ కలిసి డెలిగేషన్ లాగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిస్తే దానికి ప్రాముఖ్యత ఉంటుందని, మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి గానీ, తాను గానీ స్వయంగా దిల్లీకి వస్తామని ప్రకటించారు. అక్కడ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏయే అంశాలపై ఒత్తిడి తేవాలనే దానిపై చర్చిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం కోరారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం-3 బ్లాకులను తిరిగి సింగరేణికి కేటాయించేలా ఈ సమావేశాల్లో ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుతంరంగ సంస్థ అయిన సింగరేణిని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్‌కు సెమీకండక్టర్ వంటి భారీ ప్రాజెక్టు రావడం అనేది ఒక పెద్ద ‘గేమ్ ఛేంజర’ అవుతుందని భట్టి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ అంతా సాంకేతికతపైనే ఆధారపడి ఉన్నందున, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి పన్నులన్నీ రాష్ట్రం నుంచి కలెక్ట్ అయి సెంట్రల్ పూల్‌కి వెళ్తున్నాయని, అక్కడినుంచే పంపిణీ జరుగుతోందని చెప్పారు. కాబట్టి కేంద్రం దగ్గరకు వెళ్లి రాష్ట్ర వాటాను మనం తెచ్చుకోవడం మినహా వేరే మార్గం లేదుని ఎంపీలతో భట్టి విక్రమార్క చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల క్లియరెన్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌ను ఎంపీలకు అందిస్తామని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో కలిసి అందరూ కేంద్రానికి రిప్రజెంట్ చేయాలని కోరారు. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన భూసేకరణ లేదా ఇతర సహకారాలను వంద శాతం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





