డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి

– పనుల కోసం రూ.146 కోట్ల్లు విడుదల
– వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు దేవాదుల పంపులను 24 గంటలూ నడపాలి
– కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎసఏ మార్గదర్శకాలే అమలు
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదుల ఎత్తిపోతల పథకంలోని అన్ని పంపులను నిరంతరం 24 గంటలపాటు నిర్వహించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పరిధిలోని 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యంతో నింపి నీటి భద్రతను కల్పించాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు మూడో దశ పనులను వేగవంతం చేయడంపై స్పష్టమైన కార్యాచరణను సూచించారు. ప్రస్తుతం గోదావరి నదిలో సుమారు 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఏడు పంపులు పనిచేస్తూ తాగు, సాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోస్తున్నాయని అధికారులు వివరించారు. మొత్తం పది పంపులు పనిచేస్తే రోజుకు 0.23 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉండగా సుమారు నాలుగున్నర రోజుల్లో ఒక టీఎంసీ నీటిని తరలించవచ్చని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడల్లా గరిష్ట స్థాయిలో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని మంత్రి స్పష్టం చేశారు. గోదావరిలోని ఇంటేక్ నిర్మాణాలు, భారీ పంప్ హౌస్‌లు, రైజింగ్ మెయిన్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గ్రావిటీ కాల్వల పనులను సమీక్షించిన ఉత్తమ్ దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మూడు దశల పనులు పూర్తయినప్పుడే ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు రైతులకు అందుతాయని, ఎకరా కూడా మిగలకుండా ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి ప్యాకేజీకి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నెలవారీగా పురోగతిని సమీక్షించాలని ఇంజినీర్లను ఆదేశించారు. పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఇతర క్లియరెన్సులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైనచోట అదనపు యంత్రాలు, సిబ్బందిని నియమించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలరు. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తూ, వెంటనే రూ.146 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దేవాదుల పథకం పూర్తయిన అనంతరం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, జనగాం, సిద్ధిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఉత్తర తెలంగాణలోని అనేక గ్రామాలకు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన తుది డిజైన్లకు ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే బ్యారేజీల నిర్వహణ ఉంటుందని, ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్య కార్యక్రమాల్లో ఒకటని, అవసరమైన నిధుల విడుదలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. sవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేశామని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ గడువులోగా పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. దేవాదుల పథకం మొత్తం 16 ప్యాకేజీలతో మూడు దశల్లో అమలవుతోందని మంత్రి వివరించారు. మొదటి దశలో 1.23 లక్షల ఎకరాలు, రెండో దశలో 1.93 లక్షల ఎకరాలు, మూడో దశలో 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో 642 కిలోమీటర్ల పైప్‌లైన్లు, 57.16 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 306 కిలోమీటర్ల ప్రధాన కాలువలు, 2,185 కిలోమీటర్ల పంపిణీ కాలువల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆసియాలోనే అత్యంత పొడవైన 49 కిలోమీటర్ల ‘డి’ ఆకారపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భవిష్యత్తులో సమ్మక్క బ్యారేజీతో అనుసంధానం ద్వారా ఏడాది పొడవునా నీటి లభ్యత మరింత మెరుగుపడుతుందని చెప్పారు. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు భౌతిక పురోగతి 87.70 శాతానికి చేరుకుందని మంత్రి తెలిపారు. పంప్ హౌస్‌లు, పైప్‌లైన్లు, సొరంగ తవ్వకాల వంటి ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయని, కాల్వల లైనింగ్, పంపిణీ కాల్వలు, కొన్ని కీలక నిర్మాణాలు, పెండింగ్ భూసేకరణ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడుతుందని వివరించారు. మొదటి దశలోని ప్యాకేజీ-45 పూర్తిగా పూర్తికాగా, ప్యాకేజీ-46 పనులు 96.86 శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *