– ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు
– సుష్మిత.. జాగ్రత్త అంటూ ఇందిరా శోభన్ హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు పూర్తి అర్హతలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు సుష్మిత బహిరంగంగా ప్రకటించారు. పార్టీ స్థాపన, అభివృద్ధిలో తమ కుటుంబం చేసిన త్యాగాలను వివరిస్తూ తమకు జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతానని సీఎం వర్గానికి, పార్టీ నాయకత్వానికి ఆమె స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. తాజాగా దీనిపై గాంధీ భవన్‌లో కాంగ్రెస్ మహిళా నేతలు ఏర్పాటు చేసిన డియా సమావేశంలో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, కొండా సుష్మితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.’సుష్మితా.. మాటలు జాగ్రత్త’ అంటూ హెచ్చరించిన ఆమె సుష్మిత వైఖరిని, ప్రవర్తనను పూర్తిగా తప్ప్పుబట్టారు. కొండా సురేఖ తమ అక్క కాబట్టి ఆ బంధాన్ని గౌరవిస్తూనే సుష్మితకు అక్క కూతురిగా మర్యాద ఇస్తున్నామన్నారు. అయితే అసలు సుష్మిత పార్టీలో ఉందా లేదా అన్నది స్పష్టం చేయాలన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి మాట్లాడకపోతే ఇంకెవరి గురించి మాట్లాడతారని ప్రశ్నిస్తూ పార్టీ లైన్‌లో ఉండి పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. సుష్మిత తీరు ఆమె తల్లిదండ్రుల పెంపకాన్నే ప్రశ్నించేలా ఉందని ఇందిర వ్యాఖ్యానించారు. సినిమాలు చూసి డ్యామేజీ డైలాగులు కొట్టడం రాజకీయాల్లో నడవదని స్పష్టం చేశారు. సుష్మిత వెనక ఉండి బీఆర్‌ఎస్ లేదా బీజేపీ నేతలు ఇలా మాట్లాడిస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి తన తల్లికి దక్కిందంటే అది ఆమె కుటుంబానికి, సామాజిక వర్గానికి వచ్చిన గౌరవమే కదా అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వారికి ఏ పదవులు లేకపోయినా వారిని వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. గతంలోనే సురేఖ ఒకసారి క్షమాపణలు చెప్పారని, ఇప్ప్పుడు మళ్లీ ఇలాంటి వివాదాలు సృష్టించడం వల్ల పక్క పార్టీలకే అవకాశం ఇచ్చినట్లవుతుందని మండిపడ్డారు. ఎవరిపైన అయినా చిట్టా ఉంటే దానిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని, బెదిరింపులకు దిగకూడదని సూచించారు. పొలిటికల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నావంటూ రేవంత్ రెడ్డి అభిమానులు ఇలాంటి వ్యాఖ్యలను చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కౌంటర్ ఇస్తే మరింత రెచ్చిపోతానని సుష్మిత అంటున్నారని, అలా రెచ్చిపోతే నష్టపోతావని గట్టిగా హెచ్చరించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలకు పదవులు అడగాలి తప్ప, తనేం చేసిందని ఎమ్మెల్యే పదవి కోరుతోందో చెప్పాలన్నారు. ఇకనైనా సుష్మిత ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు