– పాల్గొననున్న మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్‌డబ్ల్యూ) అధ్వర్యంలో దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ, అనుబంధ రంగాల సదస్సు-2026ను హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఈనెల 18న నిర్వహించనున్నారు. సదస్సులో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉదయం 10.40 గంటలకు జరిగే సమీక్షా సమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (డీఏఎం), రైతు రిజిస్ట్రీ, ఎరువుల యాప్ (ఎఫఎఫఎస్) పురోగతిని కేంద్ర అదనపు కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ కుమార్ మెహెర్దా సమీక్షించనున్నారు. అనంతరం రైతు కేంద్రీకృత విస్తరణ వ్యవస్థ అయిన రైతు నేస్తం కార్యక్రమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజంటేషన్ ఇవ్వనుండగా, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానంపై ఏపీ ప్రభుత్వం వివరణ అందించనుంది. సుగంధ ద్రవ్యాలు, జీడిమామిడి, కోకో, కొబ్బరి, ఉద్యానవన రంగాల పురోగతిపై చర్చతోపాటు, పప్పుధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్, జాతీయ వంటనూనెల మిషన్- ఆయిల్ పామ్ పురోగతిపై సమీక్ష జరుగనుంది. నకిలీ పురుగు మందులు, ఎరువుల నియంత్రణ, ఎరువుల బ్లాక్ మార్కెట్ నిరోధం వంటి అంశాలపై కూడా విస్తృత చర్చ చేపడతారు. ఉత్తమ విధానాల ప్రదర్శనలో భాగంగా పప్పుధాన్యాల ఉత్పత్తి విధానాలపై కర్ణాటక, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ-మార్కెటింగ్‌పై కేరళ, ఆధునిక ఖచ్చిత వ్యవసాయం-హైటెక్ వ్యవసాయంపై తమిళనాడు రాష్ట్రాలు తమ అనుభవాలను వివరించనున్నాయి. మధ్యాహ్నం 2.15 గంటల నుండి ముగింపు సమావేశం జరగనుంది. ఇందులో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి అతిష్ చంద్ర చర్చల సారాంశాన్ని వెల్లడించనున్నారు. అనంతరం రాష్ట్రాల వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరి ప్రసంగించనున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మం శ్రివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగంతో సదస్సు ముగియనుంది. కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మీడియా సమావేశంలో పాల్గొంటారు. సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు రాష్ట్ర రైతులకు అవసరమైన వివిధ అంశాలను ప్రస్తావించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




