వయస్సు వల్ల చికిత్స కష్టమన్నారు

– ‘కేర్’లో సంక్లిష్ట‌ గుండె శస్త్రచికిత్స విజయవంతం
– వృద్ధురాలికి ప్రాణం పోసిన వైద్యులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: తీవ్ర గుండె సమస్య, కిడ్నీ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 84 ఏళ్ల వృద్ధురాలికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు సంక్లిష్ట గుండె శస్త్రచికిత్స చేసి సాధారణ జీవితం గడిపేలా చేయగలిగారు. అనంతపూర్‌కు చెందిన సుబ్బరత్నమ్మ (84) తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, గుండె వైఫల్యంతో తరచూ హాస్పిటల్‌లో చేరుతూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో కూర్చున్నా, పడుకున్నా తీవ్ర శ్వాస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఊపిరి తీసుకోవడానికి నిరంతరం ఆక్సిజన్ అవసరమయ్యేది. తీవ్రమైన బలహీనత కారణంగా స్వయంగా నడవలేని స్థితికి చేరుకుని దాదాపు మంచానికే పరిమితమయ్యారు. పరీక్షల్లో ఆమెకు మైట్రల్ వాల్వ్ తీవ్రంగా దెబ్బతినడంతోపాటు పల్మనరీ హైపర్‌టెన్షన్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే కిడ్నీ పనితీరు తీవ్రంగా తగ్గిపోయి ఈజీఎఫ్‌ఆర్ కేవలం 15 మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అత్యంత ప్రమాదకరంగా మారింది. వయస్సు, బలహీనత, కిడ్నీ సమస్యల కారణంగా పలుచోట్ల శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు వెనుకంజ వేసినట్లు తెలిపారు. పరిస్థితి రోజురోజుకూ విషమించడంతో కుటుంబ సభ్యులు చివరి ఆశగా కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీని ఆశ్రయించారు. కార్డియాక్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, అనస్థీషియా, నెఫ్రాలజీ నిపుణులు కలిసి కేసును సమగ్రంగా పరిశీలించి మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ ద్వారా మైట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ శస్త్రచికిత్స విజయవంతమైంది. మొదటి రోజే వెంటిలేటర్ తీసివేసినట్లు వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల్లోనే వృద్ధురాలు స్వయంగా నడవడం ప్రారంభించడంతోపాటు ఆక్సిజన్ లేకుండానే ఊపిరి పీల్చుకోగలిగారని కుటుంబీకులు చెప్పారు.

మినిమల్లీ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్స

కేర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ వాస్క్యులర్, మినిమల్లీ ఇన్వేసివ్ అండ్ ఎండోస్కోపిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రవిరాజు చికుల్లపల్లి మాట్లాడుతూ ‘84 ఏళ్ల బలహీనమైన వృద్ధురాలికి తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్, అధిక కిడ్నీ వ్యాధి, అనేక అనుబంధ వ్యాధులతో గుండె శస్త్రచికిత్స చేయడం చాలా క్లిష్టమైన విషయం.. ఇలాంటి కేసుల్లో ప్రమాదం అధికంగా ఉండటంతో చాలామంది రోగులను శస్త్రచికిత్సకు అనర్హులుగా పరిగణిస్తారు.. అయితే మినిమల్లీ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్స వల్ల శరీరానికి తక్కువ గాయం, తక్కువ రక్తస్రావం, తక్కువ నొప్పి, వేగంగా కోలుకునే అవకాశం ఉంటుంది.. సమగ్ర ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, మల్టీడిసిప్లినరీ టీమ్ సమన్వయం ఈ విజయానికి కీలకంగా మారాయి’ అని తెలిపారు. క్యాథ్‌ల్యాబ్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘వయస్సు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స సాధ్యం కాదని భావించి చాలామంది వృద్ధులు తీవ్రమైన వాల్వ్ గుండె వ్యాధులతో బాధపడుతూనే ఉంటారు.. కానీ ఆధునిక మినిమల్లీ ఇన్వేసివ్ గుండె చికిత్సలు ఇప్పుడు అధిక ప్రమాదంలో ఉన్న వృద్ధ రోగులకు కూడా సురక్షితంగా చికిత్స అందించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.. సరైన సమయంలో చికిత్స అందిస్తే తరచూ గుండె వైఫల్యంతో హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితిని, ఇతర తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు’ అని చెప్పారు. వృద్ధ రోగుల్లో తీవ్రమైన మైట్రల్ వాల్వ్ వ్యాధి చాలా సందర్భాల్లో చికిత్స లేకుండా మిగిలిపోతుందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా కిడ్నీ వైఫల్యం, పల్మనరీ హైపర్‌టెన్షన్, తీవ్రమైన బలహీనత ఉన్న రోగుల్లో సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రమాదకరంగా మారుతుందని చెప్పారు. అయితే జాగ్రత్తగా ఎంపిక చేసిన అధిక ప్రమాద వృద్ధ రోగులకు మినిమల్లీ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సలు చిన్న చీలికలు, తక్కువ శస్త్ర గాయం, వేగంగా కోలుకోవడం వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయని వివరించారు. సమయానికి సరైన పరీక్షలు, ఆధునిక గుండె చికిత్సలు అందితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వృద్ధ రోగుల జీవితాలను కూడా గణనీయంగా మెరుగుపరచవచ్చని వైద్య బృందం పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *